కేసీఆర్ పాలనలో ఎనిమిదేళ్ల పాటు పుష్కలమైన నీటితో కళకళలాడిన నారాయణపూర్ రిజర్వాయర్.. ఈసారి వెలవెలబోతున్నది. నీటిమట్టం తగ్గిపోవడంతో ఆయకట్టులో యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం కనిపిస్తున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను విడుదల చేసి రిజర్వాయర్‌ను నింపకుంటే వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉండగా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
గంగాధర, జనవరి 16 : నారాయణపూర్ రిజర్వాయర్ చొప్పదండి నియోజకవర్గానికి వరప్రదాయినిగా ఉన్నది. ఈ రిజర్వాయర్‌కు 2004లో శంకుస్థాపన జరుగగా, పూర్తి చేయడంపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకంలో భాగంగా ధర్మారం మండలం నందిమేడారం నుంచి ఈ జలాశయం వరకు 2012-13లో పైపులైన్ వేసి మిగిలిన పనులను అర్ధాంతరంగా వదిలేసింది. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి సారించారు.
నందిమేడారం నుంచి నారాయణపూర్ జలాశయం వరకు పైపులైన్‌కు మరమ్మతులు చేయించగా, 2016 అక్టోబర్ 15న తొలిసారి ట్రయల్న్ ద్వారా నీటిని ఎత్తిపోశారు. 164 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నిల్వ సామర్థ్యమున్న నారాయణపూర్ రిజ్వయర్ను నింపి, ఇక్కడి నుంచి చొప్పదండి నియోజకవర్గంలోని దాదాపు 70 చెరువులను తరలించడంతోపాటు దాదాపు 30 వేల ఎకరాలకు సాగు నీరు అందేలా చేశారు. దీంతో రైతులు ఆకాశం వైపు చూడకుండా పంటలు సాగు చేశారు. రెండు సీజన్లలోనూ ఎనాడూ రోడ్డెక్కకుండా మంచి దిగుబడులు తీశారు.
ఈ యేడాది రిజర్వాయర్‌లో నీటి మట్టం భారీగా తగ్గింది. ప్రస్తుతం సగం కూడా నీరు లేకపోవడంతో చెరువులను నింపే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయకట్టులో పంటలు కాపాడుకోవడం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే యాసంగి వరి నాట్లు వేసిన రైతులు బావులు, చెరువుల్లో ఉన్న అరకొరగా నీటితో పంటలను కాపాడుకుంటున్నారు. కానీ, మున్ముందు నీరందకపోతే పంటలు ఎండే ప్రమాదముంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఎల్లంపల్లి ప్రాజెక్టునుంచి నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్‌తో పాటు ఇక్కడి నుంచి గ్రామాల్లోని చెరువులను నింపాలని, పంటలు ఎండి పోకుండా కాపాడాలని కోరుతున్నారు.
చొప్పదండి నియోజకవర్గానికి వరప్రదాయినిగా ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్‌ను ఎల్లంపల్లి జలాలతో నింపాలి. ఇక్కడి నుంచి చెరువులను నింపి పంటలు ఎండిపోకుండా కాపాడాలి. కేసీఆర్ పాలనలో రిజర్వాయర్ నిండుకుండలా మారి ఎనిమిదేళ్లు సాగునీటికి ఏ ఇబ్బంది రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గి, పంటలకు సాగునీరందడం లేదు. నాలుగు రోజుల్లో రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోయకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తాం.
– సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్యే
ఏదాడి కిందటి వరకు కరువన్నదే లెకుండె. రిజర్వాయర్‌లో నీళ్లు ఉండుడుతోని రైతులు సంతోషంగా పంటలు సాగు చేసుకున్నరు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పన్నెండేండ్ల కిందటి పరిస్థితిని తెచ్చింది. రిజర్వాయర్‌లో ఎన్నడూ లేని విధంగా నీటి మట్టం తగ్గింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటిని ఎత్తిపోసి పంటలు ఎండిపోకుండా చూడాలి.
– గడ్డం స్వామి, రైతు (బూరుగుపల్లి)
ఒకప్పుడు చొప్పదండి నియోజకవర్గంలో బీడు భూములే ఎక్కువ కనిపించేవి. రిజర్వాయర్‌లో నీళ్లు లేక రైతులు వానకాలం పంటలు మాత్రమే వేసేవాళ్లు. 2004లోనే రిజర్వాయర్ పనులను ప్రారంభించినా అప్పటి ప్రభుత్వం పూర్తి చేయలేదు. దీంతో నీళ్లు లేక రిజర్వాయర్ ఎండిపోయి కనిపించేది. కేసీఆర్ సర్కారు వచ్చినంక ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రిజార్వయర్కు నీళ్లు వచ్చినయ్. మళ్లీ ఇప్పుడు పన్నెండేండ్ల కిందటి పరిస్థితే వచ్చింది.
– ఎండీ నజీర్, మాజీ సర్పంచ్ (నారాయణపూర్)