కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీపై నిర్లక్ష్యం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో ఇప్పటికే ద్వితీయ సంవత్సరం కూడా ప్రారంభమైనా.. బాలారిష్టాలు దాటడం లేదు. గడువు ప్రకారం ఇప్పటికే పూర్తి కావాల్సిన భవన నిర్మాణ పనులు నేటికీ పూర్తి కాలేదు. ఈ కళాశాలతోనే ఖమ్మంలో ప్రారంభమైన భవనం పూర్తి కాగా, ఇక్కడ మాత్రం నత్తకు నడకలు నేర్పుతున్నది.
మరోవైపు కళాశాలకు దూరంగా వసతి గృహాలు ఉండడం, మెడికోల రాకపోకలకు ఒకే బస్సు ఉండడంతో ఇబ్బందిగా మారింది. ఇంకోవైపు బోధన సిబ్బంది కూడా లేక విద్యార్థులు నష్టపోవాల్సి వస్తున్నది. కళాశాలకు ప్రిన్సిపాల్ రాకపోవడంతో పరిపాలనా విభాగంలో పనిచేసే సిబ్బంది కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా.. పట్టించుకునే దిక్కు కరువైంది.
కరీంనగర్, మే 11 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్టే.. బీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్లోనూ ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది. 2023 జూన్‌లో కళాశాల మంజూరు కాగా, సెప్టెంబర్‌లో 2023-24లో తరగతులను ప్రారంభించింది. కళాశాల ఏర్పాటుకు 138 కోట్లు కేటాయించింది. కరీంనగర్ శివారులోని కొత్తపల్లిలో విత్తనోత్పత్తి సంస్థకు సంబంధించిన 25 ఎకరాల్లో ఈ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
భవనం పూర్తయ్యే వరకు 7 కోట్లతో విత్తనోత్పత్తి సంస్థకే చెందిన గోదాములను ఆధునీకరించి కళాశాల తాత్కాలిక భవనంగా మార్చగా, దీనిని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్‌గా ప్రారంభించారు. మొదటి సంవత్సరం వంద మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. గతేడాది రెండో బ్యాచ్‌లో కూడా వంద మందికి ప్రవేశాలు కల్పించారు. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కళాశాలపై శీతకన్ను వేయడంతో రెండేళ్లుగా ఇంకా బాలారిష్టాలు దాటినట్లు కనిపించడం లేదు.
కరీంనగర్‌తోనే ప్రారంభమైన ఖమ్మం మెడికల్ కళాశాల భవనం పూర్తయి అందులో తరగతులు ప్రారంభం కాగా, ఇక్కడ మాత్రం ఇప్పటికీ భవన నిర్మాణం కొనసాగుతూనే ఉన్నది. అగ్రిమెంట్ ప్రకారం ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా ఈ భవనానికి ఇప్పటికీ ఒక రూపం రాలేదు. పనులు ఇలాగే కొనసాగితే మరో రెండేళ్లయినా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
కళాశాల పక్కా భవనాలు నిర్మాణంలో ఉండగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కళాశాల భవనంలో హాస్టల్ సదుపాయం లేదు. దీంతో కరీంనగర్‌లోని దూర ప్రాంతాల్లో బాలురు, బాలికలకు వేర్వేరు చోట్ల వసతి సదుపాయం ఏర్పాటు చేశారు. బాలికలకు తీగలగుట్టపల్లిలోని ఓ ప్రైవేట్ భవనంలో రెండు బ్యాచ్‌లకు ఒకే చోట హాస్టల్‌ను ఏర్పాటు చేశారు. ఈ రెండు బ్యాచుల్లో 84 మంది మెడికోలు ఉన్నారు. ఇక ఒక బాలుర బ్యాచ్‌కు విద్యానగర్‌లో, మరో బ్యాచ్‌కు శ్రీపురం కాలనీలో హాస్టళ్లు ఏర్పాటు చేశారు. హాస్టల్లో వసతి సంగతి దేవుడెరుగు ఉన్నచోటి నుంచి కళాశాలకు రావాలంటే మెడికోలు నరకం చవి చూస్తున్నారు.
ఇంత మంది వైద్య విద్యార్థులకు కేవలం 40 సీట్లు ఉన్న ఒక బస్సు మాత్రమే ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు కళాశాలలో తరగతులు ప్రారంభమవుతుతున్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు ఉదయం 7.30 గంటలకు తరగతులకు వెళ్లేందుకు సిద్ధమై ఉండాల్సి వస్తున్నది. ఉన్న చిన్న బస్సులో మూడు నాలుగు ట్రిప్పులు వేస్తే గానీ విద్యార్థులు కళాశాలకు చేరే పరిస్థితి కనిపించడం లేదు. ఇక రెండో సంవత్సరం విద్యార్థులు స్థానిక ప్రభుత్వ జనరల్ దవాఖానలో ప్రతి రోజు రెండు గంటలు ఓపీ చూడాలి. వీరికి ఉదయం 9 గంటలకే ఓపీ ప్రారంభమవుతుంది. ఒక్క బస్సుతో ఇటు మొదటి సంవత్సరం విద్యార్థులను కళాశాలకు, రెండో సంవత్సరం విద్యార్థులకు జనరల్ దవాఖానకు చేర్చాలంటే సమయం సరిపోవడం లేదు.
దీంతో విద్యార్థులు కళాశాలకు వచ్చే సమయానికి అనుగుణంగా తరగతుల నిర్వహణ చేపట్టాల్సి వస్తున్నది. కనీసం మూడు బస్సులు ఉంటే గానీ విద్యార్థులు వేళకు కళాశాలకు చేరే పరిస్థితి కనిపించడం లేదు. కళాశాల ప్రారంభమైనపుడు ఒక ట్రిప్పు, వదిలేసిన తర్వాత మరో ట్రిప్పు చొప్పున కనీసం రెండు ఆర్టీసీ బస్సులైనా ఏర్పాటు చేయాలని వైద్య విద్యార్థులు కోరుతున్నారు. 40 సీట్ల బస్సులో 60 మందికి పైగా ఒకేసారి ప్రయాణించాల్సి వస్తోందని, ఏదైనా జరిగితే తమ పరిస్థితి ఏమిటని వారు వాపోతున్నారు.
కళాశాలలో బోధనా సిబ్బంది పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. ఉన్నవారితోనే పాఠాలు బోధించాల్సి వస్తున్నది. ముఖ్యమైన పోస్టులు ఖాళీ ఉండడంతో విద్యార్థులు నష్టపోవాల్సి వస్తున్నది. 27 ప్రొఫెసర్ పోస్టులు ఉండగా పది మందే పని చేస్తున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 30 సాంక్షన్ ఉండగా 17 మంది మాత్రమే పని చేస్తున్నారు. 58 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 51 మంది పనిచేస్తున్నారు. 45 సీనియర్ రెసిడెన్స్ పోస్టులకు 30 మంది మాత్రమే ఉన్నారు.
ఇక ట్యూటర్ పోస్టులు 25 ఉండగా 15 మంది మాత్రమే పని చేస్తున్నారు. అయితే, ఉన్న పోస్టుల్లో కొందరు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నట్లు, వచ్చినప్పుడే మెడికోలకు పాఠాలు బోధిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ రకంగా తరగతుల నిర్వహణలోనూ తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తున్నది. మరో పక్క అడ్మినిస్ట్రేషన్ విభాగంలోనూ ఇదే పరిస్థితి ఉన్నది. ఈ విభాగంలో పని చేసే ఉద్యోగులు ఇలా వచ్చి అలా వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రిన్సిపాల్ కూడా పూర్తి స్థాయిలో కళాశాలకు రాకపోవడంతో కళాశాలలో ఇటు అడ్మినిస్ట్రేషన్, అటు తరగతుల నిర్వహణ గందర గోళంగా మారినట్లు విమర్శలు వస్తున్నాయి.
మెడికల్ కళాశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రస్తుత ప్రభుత్వం పట్టింపు కనబర్చడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పక్కా భవన నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు పర్యవేక్షణ కరువైంది. ఏ అధికారి కూడా ఈ భవన నిర్మాణాన్ని ఇంత వరకు పరిశీలించ లేదంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కళాశాలకు దూరంగా హాస్టళ్లు ఉండడం వల్ల రాకపోకలు సాగించేందుకు విద్యార్థులు నరకం చవి చూడాల్సి వస్తున్నది.
విద్యార్థులు కోరుతున్నట్లు కనీసం సమయపాలన పాటిస్తూ రెండు ఆర్టీసీ బస్సులనైనా ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక యజ్ఞంలా సాగే మెడికల్ విద్యకు ఇలాంటి ఆటంకాలు, అసౌకర్యాలకు మెడికోలపై ప్రభావం చూపుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని భవన నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని, అప్పటి వరకు ఆర్టీసీ నుంచి రెండు బస్సులు ఎంగేజ్ చేయాలని మెడికోలు కోరుతున్నారు.