Sunke Ravi Shankar | గంగాధర, అక్టోబర్ 18: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పేరుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ దుయ్యబట్టారు. చట్టం చేయకుండా 42 శాతం రిజర్వేషన్ చెల్లదని తెలిసి కూడా బీసీలను మభ్య పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజర్వేషన్ డ్రామా ఆడాడని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో బీసీల బంద్ కు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మధురానగర్ చౌరస్తాలో వ్యాపార వాణిజ్య సముదాయాలను ముగించి వేశారు. కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. జీవోలతో బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదని తెలిసి కూడా స్థానిక ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల డ్రామాకు తెరలేపిందని దుయ్యబట్టారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు.
బీసీ రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సాగి మహిపాల్ రావు, కంకణాల విజయేందర్ రెడ్డి, వేముల దామోదర్, ఆకుల మధుసూదన్, రామిడి సురేందర్, ముక్కెర మల్లేశం తదితరులు పాల్గొన్నారు.