కాంగ్రెస్ సర్కారు రైతులను దగా చేసింది. ఎన్నికల ముందు అనేక ఆశలు చూపి, గద్దెనెక్కిన తర్వాత దొంగదెబ్బ తీసింది. అన్నిరకాల వడ్లకు మద్దతు ధరపై క్వింటాల్‌కు 500 బోనస్ ఇస్తానని హామీలు గుప్పించిన సీఎం రేవంత్‌రెడ్డి, గెలిచిన తర్వాత దొడ్డురకానికి కాదు, సన్నాలకు మాత్రమే ఇస్తానని మాటమార్చడమే అందుకు నిదర్శనంగా నిలుస్తుండగా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతాంగం తీవ్ర నిరాశకు లోనవుతున్నది. ముఖ్యమంత్రి బోగస్ మాటలపై భగ్గుమంటున్నది. ప్రభుత్వ నిర్ణయంతో 60 శాతం విస్తీర్ణంలో దొడ్డురకం సాగు చేసేవారికి ప్రయోజనం దక్కకుండా పోనుండగా, ఆవేదన చెందుతున్నది. సన్నాలకు మార్కెట్లో అధిక ధరలున్నాయని, బోనస్‌తో పెద్దగా ప్రయోజనం లేదని చెబుతున్నది. ప్రభుత్వానిది తలా తోక లేని నిర్ణయమని, అన్నిరకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది.
జగిత్యాల, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ర్టానికే అన్నం గిన్నెగా పేరుగాంచిన విషయం తెలిసిందే. వరి అత్యధికంగా పండించేది ఇక్కడే. దాదాపు పది లక్షల ఎకరాల్లో ఇక్కడ వరి సాగవుతున్నది. ప్రభుత్వం సన్నాలకు మాత్రమే 500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 60 శాతం విస్తీర్ణంలో సాగు చేస్తున్న దొడ్డురకం వరి రైతులు నష్టపోనున్నారు. జిల్లాలో నీటి వనరులు ఉన్నప్పటికీ రైతులు వివిధ కారణాలతో దొడ్డురకం సాగువైపుకే మొగ్గుచూపుతూ వస్తున్నారు.
మొత్తం 9.96లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంటే అందులో 60శాతం విస్తీర్ణంలో దొడ్డురకాలు సాగు చేశారు. సన్నాల సాగు 40 శాతానికి తక్కువగానే ఉన్నది. పెద్దపల్లి జిల్లా మినహా ఇతర జిల్లాల్లో సన్నాల సాగు అతి తక్కువగా కనిపిస్తున్నది. అలాగే మొత్తం 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేస్తే, అందులో 15.39లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డురకానికి చెందినవే అని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సన్నాల దిగుబడి కేవలం 9లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండవచ్చునని అంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న బోనస్ నిర్ణయంతో దిగుబడిలో 67శాతానికి 500 బోనస్ రాని పరిస్థితి నెలకొంది.
సన్నాలకు మార్కెట్లో అధిక ధరలు
ప్రభుత్వం సన్నాలకు 500 బోనస్ ఇస్తామని ప్రకటించినా, రైతులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి సన్నాలకు ఓపెన్ మార్కెట్లో మంచి ధర పలుకుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం క్వింటాల్‌కు 2,300 మద్దతు ధర ఇస్తున్నది. ఏ గ్రేడ్‌కు 2,320 చెల్లిస్తున్నది. ఈ లెక్కన సన్నాలు విక్రయిస్తే బోనస్ 500తో కలిపి క్వింటాల్‌కు 2,820 గరిష్ఠంగా వస్తాయని, అదే బయట మార్కెట్లో ఎక్కువ ధర వస్తుందని, ప్రైవేట్ వ్యక్తులతోపాటు పలు కంపెనీలు అధిక ధరను ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. సన్నాలకు ప్రస్తుతం మార్కెట్లో 2,700 నుంచి 2,800 పలుకుతున్నదని, ఇంకా ఎక్కువ పలికే అవకాశం ఉందని చెబుతున్నారు.
జగిత్యాలలో ఒప్పంద సాగు
జగిత్యాల జిల్లాలో 85వేల ఎకరాల్లో సన్నాలు సాగవుతుండగా, అందులో మెజార్టీ శాతం ఒప్పంద వ్యవసాయమేని రైతులు చెబుతున్నారు. వానకాలం పంట ప్రారంభం కంటే ముందే పయనీర్, కావేరి, బేయర్, మహేంద్రలాంటి ప్రముఖ కంపెనీలు పలువురు రైతులతో ఒప్పందం కుదుర్చుకొని సన్నాలు సాగు చేయిస్తున్నాయి. క్వింటాల్‌కు 2,600 నుంచి 2800 చెల్లించేలా ఒప్పందాన్ని చేసుకున్నారు. ఒకవేళ ప్రభుత్వం 500 బోనస్ ప్రకటిస్తే, ప్రతి క్వింటాల్‌కు అంత మొత్తంలో చెల్లించేందుకు అంగీకారం చేసుకున్నారు. ఈ లెక్కన ఒప్పందం కుదుర్చుకొని సన్నాలు సాగు చేస్తే క్వింటాల్‌కు 3,100 నుంచి 3,300 ధర పడుతుందని, ప్రభుత్వం 2800 ఇవ్వడం ఎంత వరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు.
సన్నాల సాగుకు కష్టాలు ఎక్కువ
మార్కెట్లో అత్యంత గిరాకీ ఉన్న సన్నాలకు బోనస్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి దొడ్డురకం కంటే సన్నరకం సాగు చేయడం కష్టంతో, ఇబ్బందులతోను కూడుకున్న పని. సహజంగా దొడ్డురకం వడ్ల పంటకాలం 135 రోజులు. సన్నవడ్ల పంటకాలం 165 రోజులు. నెల రోజులు అదనంగా రైతు శ్రమించాల్సి వస్తుంది. అలాగే పంటపెట్టుబడి సైతం పెరుగుతుందని, సాధారణ రకాల సాగు పెట్టుబడితో పోలిస్తే 4వేల నుంచి 5వేల వరకు అధికం అవుతుందని రైతులు చెబుతున్నారు.
అలాగే సన్నాలకు నల్లకాటుక రోగం, దోమపోటు, మెడవిరుపు, సుడిదోమ పోటు వంటి ప్రమాదకరమైన చీడపీడలు సోకే ప్రమాదం ఉందని, అవి సోకితే పెట్టుబడి మరింతగా పెరుగుతుందని వాపోతున్నారు. అలాగే దిగుబడి సైతం సాధారణ రకంతో పోలిస్తే తక్కువగా ఉంటుందని, ఎకరాన సన్నాలు 23 నుంచి 25 క్వింటాళ్ల మధ్య దిగుబడి ఉంటుందని, దొడ్డురకానికి చెందినవి ఎకరానికి 29 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి ఉంటుందంటున్నారు. వ్యయప్రయాసాలకు ఓర్చి చేసిన సన్నాలకు కేవలం 500 బోనస్ ప్రకటించడం అత్యంత దుర్మార్గమని వారు విమర్శిస్తున్నారు.
లక్షల మంది రైతులకు మొండిచేయి
దొడ్డరకం సాగు చేస్తున్న లక్షలాది మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర విషయంలో మొండిచేయి చూపింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో దొడ్డురకం సాగు చేసే 5లక్షల మందికి పైగా రైతులకు తీవ్ర నిరాశను కలిగించింది. మద్దతు ధరపై 500 బోనస్ ప్రకటనకు ముందు రైతులు తమకు ప్రయోజనం కలుగుతుందని కొంత ఆనందించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1200 కోట్ల వరకు రైతులకు బోనస్ రూపంలో వస్తుందని ఆశించారు.
అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో సన్నాల దిగుబడి అంచనాలను బట్టి 450 కోట్లకు మించి బోనస్ వచ్చే అవకాశం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. దొడ్డురకం సాగు చేసిన రైతులు దాదాపు 769 కోట్లు నష్టపోయినట్లేనని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వం సన్నాలకు ఇచ్చే బోనస్‌ను అతి తక్కువ మంది రైతులు వినియోగించుకునే అవకాశాలున్నాయని, మెజార్టీ రైతులు బహిరంగ మార్కెట్లో విక్రయించుకునే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం చేసిన బోనస్ ప్రకటన వల్ల ఉమ్మడి జిల్లా పరిధిలోని రైతులకు పెద్దగా ప్రయోజనం చేకూరదని, పైగా దొడ్డురకం వరి వెరైటీని సాగు చేసిన రైతులకు నష్టం కలుగుతుందని చెబుతున్నారు.
ప్లేటు ఫిరాయించిండు
చిన్నప్పుడు ఒక కథ విన్న. అదేంటి అంటే ఒక ఊర్లో ఒక పెద్ద గుట్ట ఉంటది. అట్లనే పెద్ద చెరువు ఉంటది. ఒకరోజు ఆ ఊరికి ఒక వ్యక్తి అచ్చి, నేను ఆ గుట్టను మోస్త, ఆ చెరువులోని నీళ్లను తాగుత అంటడు. బాతాలు కొడుతడు. నీతోని కాదని ఊరోళ్లందరూ అంటే, ‘నేను నిజం చెబుతున్న. కావాలంటే మీకు చూపిస్త’ అని అంటడు. దీంతో ఊరోళ్లందరు ఒక రోజు అందరూ జమై, పనులన్నీ వదలుకొని గుట్ట దగ్గరికి వస్తరు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటరు. హామీ ఇచ్చిన వ్యక్తి ‘నేను గుట్టను మోసేందుకు సిద్ధం. గుట్టను ఎత్తి నా భుజాలపై పెట్టున్రి’ అంటడు. అదేంటి గుట్టను మోస్త అంటివి కదా! అని ఊరోళ్లు అంటే.. ‘నేను ఏమని చెప్పిన. గుట్టను మోస్త అన్న. గుట్టను ఎత్తుత అనలేదు.
మీరు ఎత్తున్రి, నేను మోస్త’ అని అనడంతో అందరూ ఆశ్చర్యపోతరు. మరి చెరువుల నీళ్ల సంగతి ఏంటీ అంటే.. చెరువులకు వెళ్లి ఒక దోశెడు నీళ్లు తాగుతడు. అదేంటి? మొత్తం తాగవా.. అంటే, లేలే.. నేను ఏం చెప్పిన. చెరువుల నీళ్లు తాగుత అన్న కనీ, అన్ని నీళ్లు తాగుత అని అన్ననా..? అని చెప్పుడుతోటి ఊరోళ్లందరు తప్పుడు ముచ్చట్లు చెప్పినోన్ని ఉరికిచ్చి కొడుతరు. ఈ కథ అచ్చం మన సీఎం రేవంతం సార్ చెప్పినట్ట్టే ఉన్నది. ఎన్నికల ముందు వడ్లకు మద్దతు ధరపై క్వింటాల్‌కు 500 బోనస్ ఇస్తా అని చెప్పి, గెలిచిన తర్వాత సన్నాలకే ఇస్తా అని ప్లేటు ఫిరాయించిండు. ఇది కరెక్ట్ కాదు. మరి దొడ్డు వడ్లు సాగు చేసే రైతు ఏం కావాలి? అన్ని రకాల వడ్లకు ఇయ్యాలె.
– బద్దం రాంచంద్రారెడ్డి, రైతు (ముత్యంపేట)
అన్ని వడ్లకూ బోనస్కూ ఇవ్వాలి
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి వరి ధాన్యం క్వింటాలుకు 500 బోనస్ ఇస్తానని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక కేవలం సన్న రకాలకు మాత్రమే ఇస్తామని, దొడ్డు రకాలకు ఇవ్వనని తిరకాసు పెడుతున్నది. నూటికి 95 శాతం మంది రైతులు దొడ్డు రకాలను మాత్రమే సాగు చేసిన్రు. తద్వారా ప్రభుత్వం ఇచ్చే బోనస్ సన్న రకాలకు మాత్రమే ఇస్తామంటే, దొడ్డు రకాలు సాగు చేస్తున్న రైతులకు ఏం ప్రయోజనం? ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దొడ్డు, సన్న రకాలు అనే తేడా లేకుండా బోనస్‌ను వర్తింపజేయాలి.
– సుధాకర్ గౌడ్, రైతు (తకళ్లపల్లి)