Koppula Eshwar | ధర్మారం : రైతాంగానికి యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ధర్మారం మండల కేంద్రంలోని సింగల్ విండో వద్ద యూరియా కోసం నిలబడ్డ రైతులను ఆయన గురువారం కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్‌తో రైతులు యూరియా అందడం లేదని మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగ్గురు రాష్ట్ర మంత్రులు ఉన్నప్పటికీ రైతులకు సరిపడా యూరియా అందించడంలో పూర్తిగా విఫలమైనట్లు ఆయన మండిపడ్డారు. యూరియా వరి పొలాలకు సరిపడా వేయని పక్షంలో దిగుబడి తగ్గి రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ పాలన ఎలా ఉండెనో ప్రస్తుతం అదే పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు.
యూరియా కోసం సింగిల్ విండో గోదాముల వద్ద రైతులు చెప్పులు, పాసు పుస్తకాలు క్యూ లైన్ లో పెడితే దాన్ని విపక్ష పార్టీలపై రాష్ట్ర ప్రభుత్వం నెట్టి తప్పించుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని, బీహార్ ఎన్నికలకు ప్రచారానికి వెళ్లి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడి రైతులను ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఈశ్వర్ పేర్కొన్నారు.