Godavarikhani | కోల్ సిటీ, అక్టోబర్ 26: ఓటమి భయంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అప్రజాస్వామిక పద్ధతిలోనైనా గెలవాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందనీ, అందులో భాగంగానే తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురి చేశారని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు తోడేటి శంకర్ గౌడ్, జిల్లా అధ్యక్షులు డా, వాసంపల్లి ఆనందబాబు ఆరోపించారు. ఈమేరకు ఆదివారం గోదావరిఖనిలో విలేకరులతో మాట్లాడారు. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అనేక కుట్రలకు తెరలేపుతుందనీ, అధికారంను దుర్వినియోగం చేస్తూ ప్రత్యర్థులను తప్పించేందుకు తప్పుడు మార్గాలను ఎంచుకుంటుందని ఆరోపించారు.
ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కొనలేక ప్రజల చేతిలో చిత్తుగా ఓడిపోతారని గ్రహించి కాంగ్రెస్ ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడటం శోచనీయమన్నారు. టీఆర్ఎస్ డెమొక్రటిక్ అభ్యర్థిగా దళిత మాదిగ సామాజిక వర్గంకు చెందిన కంచర్ల మంజూషను పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ అభ్యర్థిగా నిలబెడితే ప్రభుత్వం దురుద్దేశంతో నామినేషన్ తిరస్కరణ అయ్యేలా కుట్రలకు పాల్పడిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా అమలు చేయలేదనీ, దీనితో ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ ను ఓడిస్తారన్న నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఈదునూరి నర్సింగ్, తోడేటి స్వరూప, కనుకుంట్ల రమేశ్, జయపాల్ గౌడ్, నీలం భిక్షపతి, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.