పెద్దపల్లి కమాన్, అక్టోబర్ 16 : రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి దాసరి మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు. జీవోల పేరిట కాలయాపన చేస్తూ రేవంత్‌రెడ్డి సర్కార్ బీసీ బిడ్డలను మభ్యపెడుతున్నదని విమర్శించారు. బీసీల చిరకాల కోరిక విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నేడు తలపెట్టిన ‘బంద్ ఫర్ జస్టిస్’కు బీఆర్ఎస్ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.
పెద్దపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు బంద్‌కు సహకరించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీల ఓట్లు దండుకునేందుకు 42 శాతం జీవో అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, తీరా గద్దెనెక్కాక జీవోల పేరిట వంచిస్తున్నదని మండిపడ్డారు. ఇక్కడ బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, నాయకులు మోబిన్, పెంచాల శ్రీధర్, బొడ్డుపల్లి రమేశ్, ముఖి, ముత్యం లక్ష్మణ్ గౌడ్ తదితరులున్నారు.