సారంగాపూర్, జూన్ 5 : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు దాటినా రూ.2 వేల పింఛన్ రూ.4 వేలు చేస్తామన్న మాట దేవుడెరుగు.. కనీసం కొత్త పింఛన్లు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. జూన్2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కొత్త పథకాలను అమలు చేస్తారని తెలంగాణ సమాజం ఎదురుచూసినా నిరాశే మిగిలిందన్నారు. కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా అందించడంలో.. ధాన్యం కొనుగోళ్లలో విఫలమైందని, రైతాంగం తీవ్ర అసంతృప్తితో ఉన్నదని చెప్పారు. సారంగాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావం రోజు కొత్త పింఛన్లు అమలు చేస్తారని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు అందరూ భావించారని, కానీ ఒక్కరికీ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ధాన్యం సేకరణలో ఏ రైతును పలుకరించినా కనీసం 5 నుంచి 10 కిలోలు నష్టపోయామంటున్నారని, నాది కూడా అదే పరిస్థితి అని వాపోయారు.
ప్రభుత్వ యంత్రాంగం మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యాన్ని సాధారణ రకంగా పరిగణించిందని ధ్వజమెత్తారు. ఆయిల్ కంపెనీలను అడ్డుపెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ఖజానా నింపుకొంటున్నాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కారణం ఆయిల్ కంపెనీలని కేంద్రం నెపం నెడుతున్నదన్నారు. అయితే, ఆయిల్ కంపెనీలపై పడే భారానికి అనగుణంగా ధరలను ఎస్కలేట్ చేస్తూ దాని మీద కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ వేస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వేస్తున్నదని మండిపడ్డారు. ఇక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలయ్యాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల భారం ప్రత్యక్షంగా ఆటో కార్మికులపై, క్యాబ్ ప్రైవేట్ టాక్సీ ఓనర్స్‌పై పడుతున్నదన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆటోరిక్షా కార్మికులకు నెలకు రూ.వెయ్యి భృతి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందని, 30 నెలలు గడిచినా ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమిలేని వ్యవసాయ కూలీలకు నెలకు రూ.వెయ్యి అన్నారని, వారికీ ఇవ్వలేదన్నారు. వీరిద్దరికీ నెలకు రూ.రెండు వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యువజన నాయకుడు కేసీ రెడ్డి, బూసి మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.