గోదావరిఖని, సెప్టెంబర్ 24 : రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సింగరేణి కార్మికులను నమ్మించి వంచించిందని, ఇటీవల ప్రకటించిన లాభాల వాటాలో మోసం చేసిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. కార్మికులకు జరిగిన మోసంపై బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. వాస్తవ లాభాలపై వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ చేస్తున్న పోరాటానికి జత కలిసి ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
గోదావరిఖనిలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి సంస్థను అన్ని రకాలుగా అభివృద్ధి చేశారని, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేసి వాస్తవ లాభాల్లో వాటా చెల్లించారని గుర్తు చేశారు. కానీ, కాం గ్రెస్ పాలనలో సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతున్నదని విమర్శించారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన 6,394కోట్ల లాభాల నుంచి 4,034 కోట్ల లాభాలను పక్కన పెట్టడం సరైంది కాదని సూచించారు.
కేవలం 2,360కోట్ల లాభాలపై 34శాతం వాటా చెల్లిస్తుండడం దారుణంగా మోసం చేయడమేనని మండిపడ్డారు. 2,174కోట్ల లాభాల వాటా రావాల్సిన స్థానంలో కేవలం 819 కోట్లు చెల్లించడం 12శాతమే అవుతుందన్నారు. దీనిపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, కోల్‌బెల్ట్ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భవిష్యనిధి కింద పక్కన పెట్టిన 2,300 కోట్లను ఏం చేశారో ఇప్పటివరకు వెల్లడించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నదన్నారు.
భవిష్యనిధి డబ్బులు రేవంత్‌రెడ్డికి వెళ్తున్నాయా..? ఎంపీ, ఎమ్మెల్యేలకు వెళ్తున్నాయా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వీటిని నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నదని స్పష్టం చేశారు. సమావేశంలో నాయకులు గోపు ఐలయ్య యాదవ్, నడిపెల్లి మురళీధర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.