కమాన్‌పూర్, నవంబర్ 17 : “ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీవి 420 మాటలే.. ఆరు గ్యారెంటీలు అబ్రకదబ్రే.. ఏడాది కావస్తున్నా వాటి ఆలోచనే లేదు.. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌కు ఆ ధ్యాసే లేదు” అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రజా వంచన దినోత్సవాల్లో భాగంగా ఆదివారం కమాన్‌పూర్ మండలంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామంటూ ఇంటింటికీ తిరిగి సంతకాలు పెట్టి మరీ ప్రచారం చేశారని, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి ప్రజలను ఆగం చేశారని, ఇప్పుడు ఏడాది కావస్తున్నా ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్కటైనా పూర్తిగా అమలు చేశారా? అని ప్రశ్నించారు. గ్యారెంటీలతో పాటు 420 హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా విజయోత్సవాలు జరుపుకోవడం విచిత్రంగా ఉందన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పథకాల అమలులో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు, మోసమని ధ్వజమెత్తారు. సన్నరకం ధాన్యానికి బోనస్ అంటూ రైతును మభ్యపెడుతున్నారని, ఇప్పటివరకు రైతు రుణమాఫీ వందశాతం చేయలేదని విమర్శించారు. ఇక్కడ మోసం చేసింది చాలక మహారాష్ట్ర ప్రజలను కూడా మోసం చేయడానికి వెళ్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ తాటికొండ శంకర్, యూత్ మండల అధ్యక్షుడు బొమ్మగాని అనిల్ గౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు పొన్నం రాజేశ్వరి, మాజీ జడ్పీటీసీ మేకల సంపత్ యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కొండ వెంకటేశ్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, పీఎంసీ వైస్ చైర్మన్ చింతం తిరుపతి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.