Sircilla | సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 8 : ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దోపిడి రాజ్యం.. దొంగల రాజం..’ ఈ నినాదాలు ప్రతిపక్షాలు చేసింది కాదు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిందే. వినడానికి నమ్మశక్యంగా లేకపోయిన సిరిసిల్లలో జరిగిన అక్షర సత్యం ఇది. వివరాల్లోకి వెళితే.. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాతా మధు అసెంబ్లీ స్పీకర్ను అవమానించారంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో దిష్టి బొమ్మను దహనం చేసే క్రమంలో స్థానిక అంబేద్కర్ చౌరస్థాలోని జిల్లా గ్రంథాలయం ఎదుట కాంగ్రెస్ యూత్ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇదే సమయంలో కాంగ్రెస్ యూత్ నాయకుడు దేవరాజు గల్లాను ఓ హోంగార్డు పట్టుకుని లాగడంతో గొడవకు దారి తీసింది. దీంతో అసహనానికి లోనైన కాంగ్రెస్ నేతలు తామే అధికార పార్టీ నేతలమనే విషయాన్ని మరిచిపోయి నినాదాలు చేశారు.
ఈ నినాదాలు సొంత పార్టీ నేతలనే ముక్కున వేలేసుకునేలా చేశాయి. అక్కడున్న వారంతా నివ్వెరపోయారు. తరువాత తేరుకుని పోలీస్ జులం నశించాలి అంటూ నిదాలు చేశారు. కాగా ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దోపిడి రాజ్యం.. దొంగల రాజ్యం..’ అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన నినాదాలు సోషల్ మీడియాలో వైరల్గా మారి నవ్వులు పూశాయి. సొంత పార్టీ నేతల్లోనూ ఈ వీడియో చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ నేతలు చేసిన ఆందోళన మిస్ ఫైర్ అవడం చర్చనీయాంశంగా మారింది. పట్టణశాఖ అధ్యక్షుడు సూర దేవరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సొంత పార్టీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేయడం గమన్నార్హం.