Deadheading : ఇటీవల ఫ్లైదుబాయ్ విమానం (Flydubai flight) లో పైలట్ (Pilot) పై కోపైలట్ (Co-Pilot) దాడి ఘటన అందులోని ప్రయాణికులను ప్రమాదంలో పడేసింది. అయితే డెడ్‌హెడింగ్ (Deadheading) విధానంవల్ల వారంతా సురక్షితంగా బయటపడ్డారని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో అసలు డెడ్‌హెడింగ్ అంటే ఏంది..? ఈ డెడ్‌హెడింగ్ విధానం ప్రయాణికులను ఎలా కాపాడింది..? అనే సందేహాలు చాలామంది మెదళ్లను తొలుస్తున్నాయి.
అయితే విమానయాన రంగంలో ‘డెడ్‌హెడింగ్’ అనేది ఒక సర్వ సాధారణ ప్రక్రియ. ఒక విమానాన్ని ఒక ప్రదేశం నుంచి వెనక్కి తీసుకురావడానికి అవసరమైన పైలట్లను, సాధారణ ప్రయాణికులతోపాటు అదే విమానంలో పంపడాన్ని ఇలా పిలుస్తారు. ఈ విధానమే ఇప్పుడు ఫ్లైదుబాయ్ విమానంలోని వందలాది మంది ప్రయాణికులను కాపాడి అద్భుతం చేసింది. జెరూసలేం వెళ్తున్న విమానంలో ప్రధాన పైలట్‌పై కోపైలట్ దాడి చేయడంతో అది ప్రమాదం అంచులకు వెళ్లింది. దాంతో డెడ్హెడింగ్లో భాగంగా అందులో ఉన్న ఇద్దరు ట్రెయినీ పైలట్లు ఆ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో నాడు విమానంలో జరిగిన భయానక ఘటనలకు సంబంధించిన వివరాలను డేనియల్ ష్లిక్టర్ అనే ప్రయాణికుడు ‘అసోసియేటెడ్ ప్రెస్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం.. కాక్‌పిట్‌లో గొడవ మొదలవగానే ప్రయాణికులంతా భయాందోళనలకు గురయ్యారు. కొందరు ప్రయాణికులు ధైర్యంచేసి కోపైలట్‌ను పట్టుకున్నారు. అదే సమయంలో ప్రయాణికులుగా ఉన్న ఇద్దరు ట్రెయినీ పైలట్లు హీరోల్లా స్పందించారు. వారిలో ఒకరు అతి కష్టమ్మీద కాక్‌పిట్‌లోకి వెళ్లి విమానాన్ని నియంత్రణలోకి తెచ్చుకోగా.. రెండో వ్యక్తి కూడా అతడికి జత కలిశారు.
అయితే హీరోల్లా దూసుకొచ్చిన ఆ ఇద్దరు ఎవరో తమకు తెలియదని ష్లిక్టర్ చెప్పారు. వారిని నమ్మొచ్చో లేదో అర్థం కాలేదని, ఒకవేళ వాళ్లు ఉగ్రవాదులై విమానాన్ని ఇరాన్‌కు హైజాక్ చేస్తున్నారేమోనని భయపడ్డామని తెలిపారు. కానీ ఆ తర్వాత కాసేపటికే కాక్‌పిట్ నుంచి ప్రకటన వచ్చిందని, విమానం సౌదీ అరేబియాలోని తబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ అవుతోందని, అంతా క్షేమంగా ఉన్నారని ఆ ప్రకటనలో చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నామని చెప్పారు.
టెల్అవీవ్ నుంచి దుబాయ్‌కి ఆ విమానాన్ని తిరిగి నడిపేందుకు ఆ ఇద్దరు ట్రైనీ పైలట్లను డెడ్‌హెడింగ్ విధానంలో భాగంగా ప్రయాణికులుగా పంపారు. ఈ ‘డెడ్‌హెడింగ్’ ఏర్పాటే ఊహించని విధంగా ఒక పెను ప్రమాదాన్ని అడ్డుకుని, ప్రయాణికులను కాపాడింది. పైలట్లను నిజమైన హీరోలుగా నిలబెట్టింది. వారికి తామంతా జీవితాంతం రుణపడి ఉంటామని ష్లిక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.