Delhi : దేశరాజధాని ఢిల్లీలోని కీర్తి నగర్లో కారు ప్రమాదం జరిగింది. ఒక వృద్ధ దంపతులను కారు ఢీకొనడంతో వారు ఎగిరిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డుకాగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. వెస్ట్ ఢిల్లీ, కీర్తి నగర్లో, ఆర్య సమాజ్ మందిర్ సమీపంలో శుక్రవారం ఉదయం 8.45 గంటలకు జరిగింది.
వృద్ధ దంపతులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన హ్యూండాయ్ క్రెటా కారు వేగంగా ఢీకొంది. దీంతో దంపతులు పైకి ఎగిరి దూరంగా కింద పడ్డారు. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల్ని కుసుమ్ తగ్రా (71), ఆమె భర్త దయానంద్ తగ్రా (79)గా గుర్తించారు. ఈ ఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. వారు వెంటనే స్పందించి, ఇద్దరినీ సమీపంలోని కర్లా ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరూ కిందపడ్డప్పుడు తీవ్రంగా గాయపడ్డారు. దయానంద్ రోడ్డుపై పడిపోగా.. అక్కడ తీవ్ర రక్తస్రావం కావడం కనిపించింది. బాధితుల పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ఈ ఘటనపై స్తానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో నవ్లీన్ కౌర్ (49) అనే మహిళ కారు నడిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవ్లీన్ కౌర్‌ను అరెస్టు చేశారు. ఆమె కారును సీజ్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.