BRS leader Kancharla Ravigoud | సిరిసిల్ల టౌన్, నవంబర్ 3: భద్రాద్రి జిల్లాలోని మనుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడి అప్రజాస్వామికం అని బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ విమర్శించారు. ప్రభుత్వ మద్దతులో భాగంగానే పోలీసుల సమక్షంలో దాడి జరిగిందని ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జూబ్లిహిల్స్ ఎన్నికల సర్వే ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి వందశాతం అనుకూలంగా వచ్చాయన్నారు. దీనిని జీర్ణించుకోలేకనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో సస్యశ్యామలంగా వర్ధిల్లిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీవ్ర అలజడులకు గురవుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని అణచివేయాలన్న దురుద్దేశ్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడుతోందన్నారు.
తెలంగాణ సమాజం కాంగ్రెస్ దుష్చర్యలను గమనిస్తున్నదని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. రేవంత్ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్దిమార్చుకుని ప్రజా సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించాలని సూచించారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీపై దౌర్జన్యానికి దిగితే రాష్ట్ర వ్యాప్తంగా తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అఫ్రోచ్, వడ్లూరి వేణు, సిరిమల్లె హరీష్, సంపత్, కనకయ్య, రమేష్, నరేష్, రాము తదితరులు పాల్గొన్నారు.