మున్సిపల్ ఎన్నికలవేళ జాతీయ పార్టీల్లో టికెట్ల మంట రాజుకున్నది. దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లో కార్చిచ్చులా రగిలింది. కాంగ్రెస్‌లో కల్లోలం.. బీజేపీలో విలాపాన్ని సృష్టించింది. ప్రధానంగా జగిత్యాల జిల్లాలోని అన్ని బల్దియాల్లో టికెట్ల పంపిణీ వివాదాస్పదంగా మారింది. మాజీమంత్రి జీవన్‌రెడ్డి వర్గానికి 20 స్థానాలు అని ప్రకటించిన అధిష్టానం, మధ్యాహ్నానికల్లా ఐదుస్థానాలు కోత పెట్టడంతో శ్రేణుల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. తమకు టికెట్ రాకుండా చేశాడంటూ జగిత్యాల ఎమ్మెల్యేపై ‘అరేయ్ నువ్వు ఎవనివిరా..? మా కడుపు కొడుతావురా. ఎక్కడికెళ్లి అచ్చినవురా’ అంటూ ఉచ్చరించడానికి వీలులేని భాషలో జీవన్ వర్గీయులు విరుచుకుపడగా, బీఫామ్ ఇస్తామని నమ్మించి మోసం చేశారంటూ మెట్పల్లి పట్టణ మహిళా అధ్యక్షురాలు కన్నీరు పెట్టుకున్నది. నలభై ఏండ్లుగా పార్టీ కోసం పనిచేస్తూ, 40కిపైగా కేసులు నమోదు చేయించుకొని జీవితాన్ని ధారబోస్తే టికెట్ నిరాకరించారని బీజేపీ సీనియర్ నాయకుడు రోదించడం దుస్థితిని కండ్లకు కడుతున్నది. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపించగా, టికెట్లు రాని అభ్యర్థులు భగ్గుమన్నారు. పార్టీ కోసం ఏండ్ల నుంచి కష్టపడి పనిచేసిన తమకు కాదని ఇతర పార్టీల నుంచి వచ్చినోళ్లకు, పైసలిచ్చినోళ్లకు టికెట్లు కేటాయించారంటూ మండిపడ్డారు.
జగిత్యాల, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజీపీలో టికెట్ల లొల్లి రాజుకున్నది. బీఫామ్‌లు సమర్పించేందుకు మంగళవారమే ఆఖరు కాగా, దాదాపుగా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో బీఫాంల పంపిణీ వివాదాస్పదంగా మారింది. జగిత్యాల, రాయికల్, మెట్పల్లి పరిధిలో అయితే కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు వ్యవహారం బజారుకెక్కింది. జగిత్యాల మున్సిపల్లోని 50 వార్డుల్లో కచ్చితంగా పార్టీ జెండా మోసిన కార్యకర్తలకే టికెట్లు ఇవ్వాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి స్పష్టం చేయగా, అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్‌కుమార్ తన వర్గానికే టికెట్లు ఇవ్వాలంటూ పట్టబట్టడంతో సమస్య జఠిలమైంది. ఈ క్రమంలో అధిష్టానం ఇరువర్గాలను సముదాయించి, వారికి టికెట్లను పంపిణీ చేసే యోచన చేసింది. అయితే జీవన్‌రెడ్డి మొదటి నుంచీ ఎమ్మెల్యే వర్గానికి టికెట్లు ఇవ్వొద్దని పోరాటం చేస్తూ వచ్చినా.. అధిష్టానం మాత్రం ఎమ్మెల్యేవైపే మొగ్గు చూపింది.
సోమవారం రాత్రి వరకు ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 15 టికెట్లు, జీవన్‌రెడ్డి వర్గానికి 35 టికెట్లు అంటూ చెబుతూ వచ్చినా.. మంగళవారం ఉదయం అందుకు విరుద్ధంగా జాబితా ప్రకటించడంతో అగ్గి రాజుకున్నది. 30 వార్డుల్లో ఎమ్మెల్యే వర్గీయులకు టికెట్లు, జీవన్ వర్గానికి 20 వార్డుల్లో టికెట్లు ఇచ్చినట్టు చెప్పింది. కానీ, జీవన్ వర్గానికి ఐదారుగురికి మించి టికెట్లు ఇవ్వలేదని గుర్తించి మాజీ మంత్రి వర్గీయులు ఉదయం నుంచే ఆందోళన చేశారు. జీవన్‌రెడ్డి ఇంటి వద్ద మీడియా సాక్షిగా ఎమ్మెల్యేను, ఎమ్మెల్యే వర్గీయులను, పార్టీ అధిష్టానాన్ని, సీఎం రేవంత్‌రెడ్డిని బండబూతులు తిట్టారు. ‘అరేయ్ నువ్వు ఎవనివిరా..? మా కడుపు కొడుతావురా. ఎక్కడికెళ్లి అచ్చినవురా’ అంటూ ఉచ్చరించడానికి వీలులేని భాషలో ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. ఒకవైపు ఆగ్రహం వ్యక్తమవుతుండగానే.. మధ్యాహ్న సమయంలో ఉదయం ప్రకటించిన జాబితా నుంచి ఐదుగురి పేర్లు తీసేసి, వారి స్థానంలో సంజయ్ వర్గానికి చెందిన మరో ఐదుగురి పేర్లను ప్రకటించడంతో జీవన్‌రెడ్డి వర్గీయులు మరింత భగ్గుమన్నారు. జగిత్యాలతోపాటు రాయికల్ మున్సిపాలిటీలోనూ అభ్యర్థుల ఎంపిక విషయంలో సంజయ్‌కుమార్ వర్గానికే పెద్దపీట వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో రాయికల్‌లో కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు బత్తిని నాగరాజు, మహిళా అధ్యక్షురాలు తాటిపాముల మమత పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రెస్‌మీట్ పెట్టి ప్రకటించారు. అలాగే 2వ వార్డు బీఫామ్ ప్రకటించబడిన రాయికల్ పట్టణశాఖ అధ్యక్షుడు మ్యాకల రమేశ్ సైతం పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించారు. జిల్లా కేంద్రంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ముందస్తు చర్యగా భద్రతా చర్యలు చేపట్టారు. అధిష్టానం సైతం ఎమ్మెల్యేను జగిత్యాలలో ఉండవద్దని చెప్పడంతో పాటు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిసింది. అయితే అధిష్టానం వ్యవహారశైలిపై జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సేవలకు గుర్తింపు లేదని, కార్యకర్తల కష్టానికి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందారు. ఈ క్రమంలో తన వర్గాన్ని కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటానని, కాగా, బీఫామ్ రాని ఒరిజినల్ కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉంటారని, వారి కోసం అండగా ఉంటానని మాట ఇచ్చారు.

బీజేపీలోనూ టికెట్ల పంపిణీపై ఆగ్రహం వ్యక్తమైంది. జగిత్యాల మున్సిపల్ పరిధిలోని 22 డివిజన్‌కు చెందిన సీనియర్ నాయకుడు, రెండు సార్లు కౌన్సిలర్‌గా పనిచేసిన ఏసీఎస్ రాజును కాదని, వేరే వ్యక్తికి టికెట్ కేటాయించడంతో తీవ్ర నిరాశ చెందాడు. సిట్టింగ్ కౌన్సిలర్‌కు టికెట్ ఇవ్వకుండా మరొకరికి కేటాయించడంతో కన్నీటి పర్యంతమయ్యాడు. నలభై ఏండ్లకు పైగా పార్టీలో పనిచేస్తే తనకు ఇచ్చే గుర్తింపు ఇదానా..? అంటూ వాపోయాడు. అలాగే పాతవాడకట్టులో మున్నూరుకాపు సామాజిక వర్గానికి ఒక నాయకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. పదేండ్లుగా పార్టీ తరఫున పనిచేస్తూ.. పార్టీ కార్యక్రమాలకు సైతం లక్షల వ్యయం చేస్తూ.. కుల సంఘానికి లక్షల విలువ చేసే కొంత భూమిని సైతం విరాళంగా అందించిన సదరు నాయకుడికి కాకుండా కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. జగిత్యాల పట్టణంలో పదుల సంఖ్యలో టికెట్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని, 5లక్షల నుంచి 8లక్షలు తీసుకొని టికెట్లు కేటాయించారంటూ ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆరోపిస్తున్నారు. మిగతా మున్సిపాలిటీల్లోనూ ఇలానే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సంజయ్‌కుమార్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. అయితే, ఆయన ఆ పార్టీలో చేరానని చెప్పకుండా అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాని ప్రకటిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయనను నమ్ముకొని కొందరు నాయకులు, కార్యకర్తల నడిచారు. పలు సందర్భాల్లో ఎమ్మెల్యే మాటలు నమ్మి.. పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో తమకు అవకాశం లభిస్తుందని ఆశపడ్డారు. కానీ, ఇప్పుడు భంగపాటు ఎదురైంది. రాయికల్‌లో 9వ వార్డు టికెట్ ఆశించిన వాసం రాజేందర్‌కు, మొదటి నుంచి ఎమ్మెల్యేను నమ్ముకొన్న జగిత్యాల 12వ వార్డుకు చెందిన సిట్టింగ్ అభ్యర్థి వొద్దినేని శ్రీలత రాముకు, అలాగే సిట్టింగ్ అయి న తిరుమలయ్య, తోట మల్లికార్జున్, చుక్క నవీన్‌కుమార్, ముస్కు నారాయణరెడ్డి, మేక పద్మావతి, బొడ్ల జగదీశ్, ఠాకూర్ ప్రభాత్ సింగ్‌కు టికెట్లు రాలేదు. వీరితోపాటు మరికొందరు ద్వితీయ శ్రేణి నాయకులకు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. ‘నమ్మి బీఆర్ఎస్ నుంచి వస్తే ఇలా నిండా ముంచుతారా..? తమకు అన్యాయం చేస్తారా..’ అంటూ మాజీ కౌన్సిలర్లు వాపోయారు. ఎమ్మెల్యే వెంట నడిచిన తమకు ఏ ప్రయోజనం దక్కలేదని మండిపడుతున్నారు. అన్నం పెట్టిన బీఆర్ఎస్ను కాదనుకొని వచ్చినందుకు తమకు మంచి శాస్తే జరిగిందని వాపోతున్నారు.
వేములవాడ, ఫిబ్రవరి 3: వేములవాడలో కాంగ్రెస్ టికెట్లు రాకపోవడంతో పలువురు అభ్యర్థులు కన్నీటి పర్యంతమయ్యారు. కొలకాని రాజుకు 4వ వార్డు టికెట్ ఖరారై ప్రచారంలో మునిగి తేలగా.. చివరి నిమిషంలో తప్పుకోవాల్సి వచ్చింది. ఇదే వార్డు నుంచి టికెట్ ఆశిస్తూ అదృశ్యమై వచ్చిన మరో అభ్యర్థి తోట రాజుకు బీఫాం ఇవ్వగా.. పార్టీ ఒత్తిడి మేరకు కొలకాని రాజు నామినేషన్ ఉపసంహరించుకొని కన్నీరు పెట్టారు. ఏండ్ల నుంచి పార్టీని నమ్ముకొన్న మరో ముగ్గురికి కూడా టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
హుజూరాబాద్, ఫిబ్రవరి 3 : కాంగ్రెస్‌లో జెండా మోసిన కార్యకర్తలకు చివరకు మొండి ‘చెయ్యే’ మిగిలింది. ఎన్నోఏళ్లుగా పార్టీలో ఉన్న హుజూరాబాద్ పట్టణ మహిళా అధ్యక్షురాలు యేముల పుష్పలతకు సైతం టికెట్ రాకపోవడంతో కన్నీరు పెట్టుకున్నది. దీంతో ఆమె కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి, తన ఆవేదన వ్యక్తం చేసింది. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన, డబ్బులు ఉన్న, ఆయనకు భజన చేసే వాళ్లకు మాత్రమే టికెట్లు ఇచ్చారని విమర్శించింది. ప్రణవ్ బాబుతో ఇక్కడ కాంగ్రెస్ నాశనమవుతున్నదని, ఆయనను తొలగించాలని డిమాండ్ చేసింది. పార్టీలోనే ఉంటూ స్వతంత్రంగా పోటీ చేసి తమ సత్తా చూపిస్తామని తెలిపింది.
మెట్పల్లి, ఫిబ్రవరి 3 : పదేండ్లు కష్టపడి పార్టీ కోసం పనిచేస్తే టికెట్ ఇవ్వకుండా నమ్మించి మోసం చేశారని కాంగ్రెస్ మెట్పల్లి పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆదుర్తి హరిత కన్నీటిపర్యంతమైంది. 24వ వార్డు నుంచి పోటీ చేసేందుకు బీఫామ్ ఇస్తామని జగిత్యాలకు రావాలని డీసీసీ అధ్యక్షుడు నందయ్య ఫోన్ చేయగా, మంగళవారం ఉదయమే ఆమె వెళ్లింది. రెండున్నర గంటల పాటు వేచి చూసింది. తీరా బీఫాం ఇచ్చే సమయంలో హరిత పేరు మార్చి ఇతరులకు టికెట్ ఇస్తున్నట్టు చెప్పడంతో హతాశురాలైంది. కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావును అడగాలని డీసీసీ అధ్యక్షుడు చెప్పడంతో హరిత మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లింది. అక్కడే ఉన్న జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మిపై పడి బోరున విలపించింది. తర్వాత మెట్పల్లి పట్టణ కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేసింది. పార్టీ కోసం పనిచేస్తే తనను నిలువునా ముంచారంటూ ఆమె విలేకరుల ముందు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఫాం ఇస్తానంటే జగిత్యాల వెళ్లానని, కానీ, అక్కడ తన పేరుతో ఉన్న బీఫామ్‌ను జిల్లా అధ్యక్షుడు నందయ్య చించి వేసి అవమానించారని కన్నీరు పెట్టుకున్నది. పార్టీ పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించింది.
జగిత్యాల, ఫిబ్రవరి 3 : జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య బీఫామ్స్ కొట్లాట జరిగింది. 29వ వార్డులో జీవన్‌రెడ్డి వర్గం నుంచి సీనియర్ నేత తోపారపు లావణ్య, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం నుంచి ఆరుముల్ల తేజశ్రీ నామినేషన్లు వేశారు. కాగా, మంగళవారం ఉదయం జాబితాలో ఉన్న లావణ్య పేరును మధ్యాహ్నానికి తొలగించి, తేజశ్రీ పేరు రావడంతో ఆగ్రహం వ్యక్తమైంది. అయితే ఇరువురు అభ్యర్థులు బీఫామ్ తమకంటే తమకే వచ్చిందంటూ జిల్లా కేంద్రంలోని నామినేషన్ కేంద్రంలో దాఖలు చేయడానికి రాగా, ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో తేజశ్రీ వర్గీయులు ఆగ్రహంతో లావణ్య బీ ఫాంను చించివేయగా, గొడవ ముదిరింది. పోలీసులు వచ్చి ఇరువర్గాలను బయటికి తీసుకెళ్లారు. నాయకులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు సమాచారం ఇవ్వగా, ఆయన లావణ్య పేరును ఫైనల్ చేశారు. మరో బీఫామ్‌ను అందించగా, ఆమె దాఖలు చేశారు. అలాగే 26వ వార్డుకు సంబంధించి జాబితాలో వీరబత్తిని పద్మజ పేరు ఖరారైంది. బీఫామ్ కోసం పద్మజ నాయకులతో కలిసి డీసీసీ అధ్యక్షుడు నందయ్య ఇంటికి వెళ్లగా, ఆమె పేరిట ఉన్న బీఫామ్‌ను చించేశారు. మాధవీలతకు కొత్త బీఫామ్ అందచేయగా, పద్మజ ఆగ్రహించారు.
సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 3 : సిరిసిల్ల మున్సిపల్ పదో వార్డులో మాజీ కౌన్సిలర్ బొల్గం నాగరాజుగౌడ్ తన సతీమణికి బీ ఫామ్ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేశాడు. అంబేద్కర్ విగ్రహానికి పత్రాన్ని అందజేశాడు. పార్టీ జెండాలను రోడ్డుపై వేసి ఆందోళన చేశాడు. గత మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన తనను కాదని, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తికి బీఫామ్ ఎందుకిచ్చారు? ఎవరెక్కువ పైసలిస్తే వారికే బీఫామ్‌లు ఇస్తారా..? ఇదెక్కడి న్యాయం? అంటూ మండిపడ్డాడు. బీ ఫామ్ అడిగితే పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు గోపి డబ్బులు డిమాండ్ చేశాడని ఆరోపించాడు.