కరీంనగర్ కార్పొరేషన్, జూలై 28 : రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ బీసీలను మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. బీసీల కోసం పోరాటం చేస్తున్నది బీఆర్ఎస్సేనని, ఇంకా మోసం చేయాలనుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్‌ను తొమ్మిదో షెడ్యూల్లో పొందుపరచాలని డిమాండ్ చేశారు. సోమవారం రేకుర్తిలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ఆయన సందర్శించారు.
స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ మోసాలకు బీసీలు బలి అవుతున్నారని ఆవేదన చెందారు. ఒకరు ఇస్తామని, మరొకరు ముస్లింలు ఉంటే అడ్డుకుంటామని మనోభావాలను దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే 42శాతం రిజర్వేషన్‌ను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేంత వరకు ఢిల్లీలో తిష్టవేయాలని సూచించారు. అప్పుడే మోడీ ప్రభుత్వం దిగి వస్తుందని చెప్పారు.
అందుకు తామంతా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. గతంలో తమిళనాడు సీఎం జయలలిత అలాగే భీష్మిస్తేనే అప్పటి ప్రధాని పీవీ ప్రభుత్వం దిగొచ్చి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చారని గుర్తు చేశారు. అలా కాకుండా మొక్కుబడిగా అక్కడో ఇక్కడో ధర్నా చేస్తామంటే ప్రభుత్వాలు దిగి రావని చెప్పారు. బీజేపీ మెడలు వంచాలంటే రాజకీయాలకు అతీతంగా బీసీల అఖిలపక్షాన్ని ఢీల్లీకి తీసుకొని పోవాలని సూచించారు. అలా కాకుండా బీసీ మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే తీవ్ర పరిణమాలు ఉంటాయని హెచ్చరించారు. తాము మొదటి నుంచి చెబుతున్నామని ఆర్డినెన్స్‌లు, ఇతర వాటితో ఏమి కాదని, రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలంటే తమిళనాడు ఎలా చేసిందో అలా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే దానిని సాధించుకోవాలని సూచించారు. పదేళ్లు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సీమాంధ్ర నాయకులెవరూ నోరు మెదపలేదని, ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం పోయిందో అప్పటి నుంచి తెలంగాణపై రెచ్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఆడించినట్టు బీజేపీ నాయకులు ఆడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, మోడీ అందరూ కలిసి తెలంగాణపై విషం చిమ్మే కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.
తెలంగాణ ప్రజలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా సీమాంధ్ర నాయకులు వ్యవహరిస్తే తెలంగాణ నుంచి మరో యుద్ధం మొదలవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఎదుర్ల రాజశేఖర్, సుధగోని మాధవి, మాజీ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎనుగు రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ కొత్తపల్లి మండల అధ్యక్షుడు కాసరపు శ్రీనివాస్‌గౌడ్, నాయకులు కర్ర సూర్య శేఖర్, గంగాధర చందు, రాచకొండ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధికి నిధులు ఇవ్వాలి
రేకుర్తి లక్ష్మీనర్సింహస్వామి చాలా గ్పొప్ప దేవాలయం. ప్రపంచంలోనే శంఖు చక్రాలతో వెలిసిన ఏకైక స్వయంభూ దేవాలయం. యాదగిరి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేసే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ హయంలో ఈ దేవాలయ అభివృద్ధి కోసం 25 కోట్లు మంజూరు చేసి పనులు చేయించాం. ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉన్నది. వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. వెంటనే విడుదల చేయాలి.
– మాజీ మంత్రి గంగుల కమలాకర్