యైటింక్లయిన్‌కాలనీ, ఫిబ్రవరి 6: రామగుండంలో రౌడీపాలన కొనసాగుతోందని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని.. అభివృద్ధి పేరిట ఈ రెండేండ్లలో విధ్వంసమే జరిగిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ విమర్శించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెసోళ్లకు బాకీకార్డులు చూపించి నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పోటీపడి గెలువలేక కాంగ్రెస్ దొంగదారిలో బీఆర్ఎస్ అభ్యర్థులు, కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.
ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 14, 17, 19 డివిజన్లలో టీబీజీకెఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అర్ధరాత్రి దొంగల్లా ఆలయాలు, దుకాణాలను కూల్చుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అభ్యర్థులు మేడి వనిత, రవినాయక్, దాసరి భాగ్యలక్ష్మి, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు అయిలి శ్రీనివాస్, నాయకులు ఎరబెల్లి శ్రీనివాస్‌రావు, ముక్కెర మొగిలి, పులి రాకేశ్, తదితరులు పాల్గొన్నారు.