నాలుగు పథకాల అమలుపై నిర్వహిస్తున్న గ్రామసభలు గందరగోళంగా సాగుతున్నాయి. మొదటి రోజు మంగళవారం నుంచి రసాభాసగా నడుస్తున్నాయి. మూడో రోజూ అదే తీరున సాగాయి. గురువారం ఎక్కడ చూసినా రచ్చరచ్చ అయ్యాయి. నిలదీతలు.. నిరసనలతో అట్టుడికాయి. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులకు సంబంధించిన జాబితాలను చదువుతుండగా, మెజార్టీ గ్రామాల్లో ప్రజలు అభ్యంతరం తెలిపారు. అర్హుల పేర్లు గల్లంతయ్యాయని, అనర్హులకు అవకాశం కల్పించారంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. అన్ని పథకాలు ఉన్నోళ్లకేనా..? గరీబోళ్లకు ఇవ్వరా..? అంటూ ప్రశ్నించారు. ఏ ఒక్క దానిలోనైనా చోటు కల్పించరా అని నిలదీశారు. అర్హతలున్నా తమకు అన్యాయం జేస్తరా..? తాము అర్హులం కాదా..? ఎందుకీ గ్రామ సభలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందడం లేదని, జాబితాలు తప్పల తడకలా తయారు చేశారని ధ్వజమెత్తారు. దాంతో ఆయాచోట్ల సమాధానం చెప్పలేక అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అయినా ప్రజలు వినకుండా.. ఇంకా ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని ప్రశ్నించారు. కొన్నిచోట్ల పోలీస్లతో అడ్డుకునే ప్రయత్నం చేయగా, మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
– కరీంనగర్, జనవరి 23 (నమస్తే తెలంగాణ)
జూలపల్లి, జనవరి 23 : జూలపల్లి గ్రామసభలో రైతులు, మహిళలు ఆగ్రహించారు. అధికారులు జాబితాలోని పేర్లు చదువుతుండగా, 2 లక్షలపైన పంట రుణమాఫీ కోసం నిలదీశారు. ఒక్క జూలపల్లిలోనే 212 మందికి మాఫీ కావాల్సి ఉన్నదని, వారికి ఇంకెప్పుడు మాఫీ చేస్తారని ప్రశ్నించారు. పథకాలన్నీ ఉన్నోళ్లకేనా..? కూలీ పనులు చేసుకునేటోళ్లకు వర్తించవా..? అంటూ విరుచుకుపడ్డారు. అధికారులు, రైతులు, మహిళల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగ్గా, పోలీసులు నిలువరించారు.
కమాన్పూర్, జనవరి 23 : కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామసభ గందరగోళం మధ్య ప్రారంభమైంది. గ్రామ మాజీ ఉప సర్పంచ్ పోలుదాసరి సాయికుమార్ తమ గ్రామంలోని అర్హులైన వారందరికీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు ఎంపిక చేయాలని ఎంపీడీవోతో పాటు అధికారుల కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు. అధికారులు సమావేశం నుంచి వెళ్లకుండా ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసుల బందోబస్తు మధ్య వారిని గ్రామ సభ నుండి పంపించారు.
వెల్గటూర్, జనవరి 23 : ఎండపల్లి మండల కేంద్రంలో మహిళలు ఆగ్రహించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి తామెందుకు అర్హులం కాదంటూ అధికారులను నిలదీశారు. కూలీ, ఉపాధి పనులు చేసుకొని బతికే తమకు పథకాలు ఇవ్వరా.. అంటూ విరుచుకుపడ్డారు. భూములు, జాగలు ఉన్నోళ్లకే ఇస్తారా..? ఏం లేని తమకు ఇవ్వారా..? అంటూ మండిపడ్డారు. దీంతో కాసేపు సభలో గందరగోళం నెలకొన్నది.
కోరుట్ల రూరల్/ ఎల్లారెడ్డిపేట, జనవరి 23 : అధికారికంగా నిర్వహిస్తున్న గ్రామసభల వేదికలపై కాంగ్రెస్ నాయకులు కూర్చోవడం విమర్శలకు తావిస్తున్నది. పలుచోట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడం, దరఖాస్తుదారులను బెదిరిస్తుండడంపై అసహనం వ్యక్తమవుతున్నది. కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు ఐలాపూర్లో ఏకంగా వేదికపై కూర్చున్నారు. ఎల్లారెడ్డిపేటలో నాయకుడు వేదికపై కూర్చోగా.. మరో ఇద్దరు నాయకులు బెదిరింపులకు దిగారు. దీంతో ప్రజలు కూడా దీటుగా ఎదురుతిరగడంతో పోలీసులు జోక్యం చేసుకొని శాంతింపజేశారు.
కరీంనగర్రూరల్, జనవరి 23 : కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితా చదువుతుండగా, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో దరఖాస్తు చేసుకున్న అందరికీ ఇండ్ల వస్తున్నాయా..? అని ప్రశ్నించారు. ఎంపిక చేసిన పేర్లు చెప్పాలని, లబ్ధిదారుల ఎంపిక కాకుండా గ్రామసభలో ఆమోదం ఎలా ఉంటుందని నిలదీశారు.
మా ఊరు జూలపల్లి. మాకేం ఆస్తిపాస్తులు లేవు. గుంట భూమి కూడా లేదు. చిన్న ఇట్ల కిరాయి తీసుకుని ఉంటున్నం. నాకు భర్త, ఇద్దరు పిల్లలు. రోజూ కూలీ పనులు చేస్కొని బతుకుతం. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు పెట్టుకున్న. నా పేరు ఏ జాబితాలో కూడా రాలేదు. మరోసారి దరఖాస్తు పెట్టుకోమంటున్నరు. నేనేం పాపం జేసిన? సర్కారు మాలాంటోళ్లను పట్టించుకోదా..? గరీబోళ్లకు సాయం చేయరా..?
– కట్ట సత్యమ్మ, జూలపల్లి