కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచడంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెండో రోజూ ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం కూడా ఆందోళనలు ఉధృతంగా కొనసాగాయి. పార్టీ శ్రేణులు, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలతో కలిసి ఖాళీ సిలిండర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించాయి. ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో కట్టెల పొయ్యి పెట్టి వంట చేసి కేంద్రానికి నిరసన సెగ రాజేశాయి. మోదీ దిష్టిబొమ్మలను దహనం చేసి, పెంచిన ధరలు దించాల్సిందేనంటూ డిమాండ్ చేశాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాల్గొని కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, డాక్టర్ సంజయ్‌కుమార్, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ అధ్యక్షులు పుట్ట మధు, దావ వసంత పాల్గొని నిరసన తెలిపారు.
-పెద్దపల్లి, మార్చి 3 (నమస్తే తెలంగాణ)
గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రెండో రోజూ నిరసనలు ఉధృతంగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, మోదీ దిష్టిబొమ్మల దహనం, కట్టెల పొయ్యిలపై వంటలతో హోరెత్తించారు. కేంద్రానికి వ్యతిరేకంగా ప్లకార్డులు, ఖాళీ సిలిండర్లు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు.
-పెద్దపల్లి, మార్చి 3 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలకేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇక్కడ ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి హాజరై కేంద్రం ఇష్టమున్నట్లు ధరలు పెంచుతూ సామాన్యులపై మోయలేని భారం మోపుతున్నదని ధ్వజమెత్తారు. ఇక్కడ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తాయి. రామగుండం నియోజకవర్గ కేంద్రంలోని గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో 200 ఖాళీ సిలిండర్లను రోడ్డుపై పెట్టి నిరసన తెలిపారు.
‘నీ సిలిండర్ తీసుకుపో.. కట్టెల పొయ్యి ఇచ్చి పో, బీజేపీ హటావో తెలంగాణ బచావో’ అంటూ నినదించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తాలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మహాధర్నా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో కట్టెల పొయ్యిపై వంట నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ మాధవీ, పార్టీ సీనియర్ నాయకులు మనోహర్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు రాజు, అర్బన్ మండలం నందికమాన్ వద్ద పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్, జడ్పీటీసీ రవి, ఎంపీపీ వజ్రమ్మ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
సామాన్యులపై ధరల భారం
కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై ధరల భారం మోపి దేశ సంపదను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నది. దీనికోసం ఎంతటి నీచానికైనా తెగబడుతున్నది. నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో నేడు బీజేపీ నుంచి దేశ ప్రజలను కాపాడుకునేందుకు మలివిడుత ఉద్యమానికి బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. బీజేపీ పోకడలు ఇలానే కొనసాగితే ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదు. ఇలా ధరలు పెంచితే కూలీ నాలి చేసుకునే సగటు కుటుంబం ఎలా బతుకుతుందో మీకు అవసరం లేదా?. రైతులు, ఆడబిడ్డల ఆగ్రహానికి గురికాక తప్పదు. మోదీ ప్రభుత్వం గద్దె దిగినప్పుడే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారు. దేశంలో కేసీఆర్ నాయకత్వం అవసరం. బీజేపీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పే దమ్ము ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్‌కే ఉంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయం. -పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
పేదోళ్లను దోచేలా కేంద్రం నిర్ణయాలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పేదలను దోపిడీ చేసే విధంగా ఉంటున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు బతికే పరిస్థితి లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 13 సార్లు గ్యాస్ ధరలు పెరిగాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెంపుతో నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కాయి. మోదీ ప్రభుత్వం గద్దె దిగిపోయినప్పుడే ప్రజలకు మంచి రోజులు వస్తాయి. పేదల సంక్షేమాన్ని కూలదోస్తూ మరోవైపు ప్రజల గోస బీజేపీ భరోసా అంటూ కార్నర్ మీటింగ్‌లు చేపెడుతున్నరు. సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుంటే, బీజేపీ ప్రభుత్వం ప్రజలపై కక్షగట్టి ధరలను పెంచుతున్నది.
-రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
దుర్మార్గపు చర్య
కేంద్ర సర్కారు గ్యాస్ ధరలు పెంచి, వంటింట్లో మంట పెట్టి, పేదల నడ్డి విరుస్తున్నది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలతో సతమతమవుతుంటే, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం దుర్మార్గమైన చర్య. బీజేపీ సర్కారు గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతే మళ్లీ కట్టెల పొయ్యిలే దిక్కవుతయ్. 30 ఏండ్ల కిందటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నది. అధికారంలోకి వస్తే గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పిన బీజేపీ అధికారంలోకి రాగానే పెంచుకుంటూ పోతూ పేదల ఉసురు పోసుకుంటున్నది. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం.
-పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
ఆడబిడ్డల ఉసురు తుగులుతది
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిలిండర్ ధరను 13 సార్లు పెంచారు. గతంలో రూ.400 ఉంటే ఇప్పుడు రూ.1175కి చేరింది. ధరలు పెంచిన బీజేపీ నాయకులకు ఆడబిడ్డల ఉసురు తగులుతది. ఆడబిడ్డలపై ప్రేమ, చిత్త శుద్ధి ఉంటే 50 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలి. గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలి. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ బీజేపీ అయితే.. నీతి నిజాయితీగా పని చేయడంలో కేరాఫ్ అడ్రస్ బీఅర్ఎస్ సర్కారు. కేంద్రం గ్యాస్ ధర తగ్గించే వరకు పోరాటం ఆగదు.
– జగిత్యాల జడ్పీ చైర్మన్ దావ వసంత
కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం
మోదీ సరార్ గ్యాస్ ధర పెంచి కట్టెల పొయ్యి సంస్కృతికి శ్రీకారం చుడుతున్నది. కాంగ్రెస్, బీజేపీవి చీకటి ఒప్పందం. కేంద్రం గ్యాస్ ధర పెంచితే రాష్ట్రం భరించాలని కాంగ్రెస్ అనడం దాని అవివేకానికి నిదర్శనం. క్రూడాయిల్ ధరలు తగ్గినా దేశంలో మాత్రం ధరలు పెరుగుతున్నాయి. కేంద్రం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల రూపాయి విలువ పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తుంటే బీజేపీ మాత్రం ధరలు పెంచుకుంటూ పోతున్నది. నిన్నా మొన్నటి దాక ఈశాన్య రాష్ట్రల్లో ఎన్నికలు ఉండడం వల్ల ధరలు పెంచలేదు. మూడింటిలో రెండు గెలిచారు. ధరలు పెంచారు. మన దగ్గరకు వస్తారట. ఇక్కడ ఒకవేళ గెలిస్తే మళ్లీ ధరలు పెంచుతరు. ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి.
-ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్