Raghavpur | పెద్దపల్లి రూరల్, జూలై 8 : పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 1072 భూములపై అధికారులు ప్రజాప్రతినిధులు కన్నేశారు. గతంలో గ్రామ ప్రజల అవసరాలకు కేటాయించిన భూములను హద్దులను శిథిలం చేస్తూ అదే ప్రజా అవసరాలపేరుతో మరో కొత్తపథకాలకు భూములను కేటాయిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు కాస్తా మింగుడు పడక ఆందోళన వ్యక్త చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దపల్లి మండలం రాఘవాపూర్ శివారులో 1072లో కులాలు, సంఘాల వారిగా కమ్యూనిటీలకు భూములను గతప్రభుత్వాలు కేటాయించాయి.
కాగా వాటి స్థానంలో ఇప్పుడు తాజాగా మరో కొత్త పథకం పేరుతో భూములను స్వాదీనం చేసుకుని పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ కోవలోనే గతంలోనే స్మశాన వాటిక (వైకుంఠదామం)కు కేటాయించిన స్థలాన్ని ఇప్పుడు సోలార్ విద్యుత్ కేంద్రానికి ప్రస్తుత ప్రభుత్వం కేటాయించింది. పనులు దక్కించుకున్న అప్పన్నపేట సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో చదును చేసే పనులను రెండు రోజులుగా చేపడుతున్నారు.
అయితే తమ గ్రామానికి స్మశాన వాటిక కూడా లేకుండా చేస్తారా..? ఎవరైనా చస్తే ఎక్కడ పెట్టుకోవడమంటూ మంగళవారం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు మద్దతు పలికి గ్రామ అవసరాలకు భూములను కేటాయించినంకనే ఇతర అవసరాలకు ఇక్కడి ప్రభుత్వ భూములను వాడుకోవాలని డిమాండ్ చేశారు.