కరీంనగర్ రూరల్: జనవరి 11: హిట్ అండ్ రన్ కేసుల్లో ఏడేండ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల దాకా జరిమానా విధించేలా కేంద్రం తెచ్చిన చట్టంపై లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. గురువారం కరీంనగర్ బైపాస్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. లారీలు, టిప్పర్లు, రెడీమిక్స్ కాంక్రీట్ వాహనాలను నిలిపివేసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో చర్చించకుండానే ఈ చట్టానికి ఆమోదముద్ర వేయడం బాధాకరమన్నారు.
ఈ చట్టం లారీ డ్రైవర్ల పాలిట ఉరితాడు లాంటిదన్నారు. రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్లనే బాధ్యులను చేయడం సరికాదన్నారు. 90 శాతం ప్రమాదాలు మానవేతర కారణాలవల్లే జరుగుతున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలిందన్నారు. కానీ కేంద్రం ప్రతిపక్షాల పార్లమెంట్ నుంచి బయటకు గెంటేసి ఈ బిల్లును పాస్ చేయించిందని ఆరోపించారు.
ఇప్పటికైనా ఈ యాక్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేశ్, లారీ డ్రైవర్ల యూనియన్ పట్టణ అధ్యక్షుడు ఎన్కే ఆరిఫ్మొహినొయొద్దీన్, శ్రీనివాస చారి, దస్తగిరి, ఎండీ షఫీ, వెంకన్న, భద్రయ్య, సురేందర్, సదానందం, సత్యనారాయణ, హైమత్, రమేశ్ పాల్గొన్నారు.