Panjala Srinivas | చిగురుమామిడి, జూలై 16: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కామ్రేడ్లు సత్తా చాటి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండలంలోని చిగురుమామిడి, ఇందుర్తి, సుందరగిరి గ్రామాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో కామ్రేడ్లు పట్టు సాధించాలని, మండలంలో పూర్వ వైభవం కోసం కమ్యూనిస్టులు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించే దిశగా కార్యకర్తలు ముందుకు వెళ్లాలన్నారు. నాటి వైభవం కోసం సమిష్టిగా కృషి చేస్తే కామ్రేడ్లు పట్టు సాధించే అవకాశం ఉందన్నారు. అన్ని గ్రామాల్లో ప్రజా సమస్యలపై కమ్యూనిస్టులు పోరాడాలన్నారు.
ఈ సమావేశంలో మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు అందే స్వామి, సింగిల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, మండల సహాయ కార్యదర్శి బూడిద సదాశివ, జిల్లా నాయకులు అందే చిన్న స్వామి, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, తాళ్లపల్లి చంద్రయ్య, కూన లెనిన్, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం నూతనంగా జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన పంజాల శ్రీనివాస్ ను ఆయా గ్రామాల సీపీఐ గ్రామ శాఖ ల ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారు.