ప్రభుత్వ పాఠశాలలపై సర్కారు చిన్నచూపు చూస్తున్నది. ప్రాథమిక విద్యను పూర్తిగా గాలికొదిలేసింది. సర్కారు బడి పిల్లల్లో డిజిటల్ లిట్రసీని పెంచడం, స్మార్ట్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటే లక్ష్యంగా గత సర్కారు గతేడాది నవంబర్‌లో జగిత్యాల జిల్లాలోని 93 అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లకు 465, ఎమ్మార్సీ సెంటర్లకు 75 కంప్యూటర్లు పంపించగా, ఆ తర్వాత నెల రోజులకే ప్రభుత్వం మారడంతో పాలసీ అటకెక్కింది. ఒక్కో విద్యాలయానికి ఐదేసి కంప్యూటర్లు అందించగా, అవి ఎందుకు వచ్చాయో..? వాటిని ఎలా వినియోగించాలో..? అసలు వాటిని ఎక్కడ పెట్టాలో తెలియని దుస్థితిలో విద్యాశాఖ పనిచేస్తోంది. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకుండా డబ్బాల్లో మగ్గుతుండగా, పట్టని ఉన్నతాధికారుల తీరు విమర్శలకు తావిస్తున్నది.
జగిత్యాల, నవంబర్ 24(నమస్తే తెలంగాణ): భవిష్యత్తు మొత్తం డిజిటల్ రంగానిదే. ప్రపంచం కాదు, విశ్వమే ఒక కుగ్రామంగా మారిపోయి, మనిషి అరచేతిలోనే విశ్వమంతా అమరిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇలాంటి కాలంలో రాష్ట్రంలోని చిన్నారులను సాంకేతికరంగ నిపుణులుగా తీర్చిదిద్ది, వారిని డిజిటల్ ప్రపంచంలో ఒక భాగం చేయాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ పనితీరు సాగింది. రాష్ర్టాన్ని కంప్యూటర్ రంగానికి కేంద్ర బిందువుగా మార్చేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టిన విషయం తెలిసిందే. కంప్యూటర్ రంగాన్ని అభివృద్ధి చేయడంతోపాటు కంప్యూటర్ను గ్రామీణ ప్రాంత ప్రజలు, విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు అనేక చర్యలు చేపట్టారు.
ప్రతి ప్రభుత్వ పాఠశాలను డిజిటల్ పాఠశాలగా, డిజిటల్ తరగతి గదిగా మార్చేందుకు సంకల్పించారు. ప్రతి పాఠశాలలో స్మార్ట్ క్లాస్‌రూమ్స్, డిజిటల్ బోధనను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ప్రతి ప్రభుత్వ పాఠశాలకు తెలంగాణ ఫైబర్‌నెట్ ద్వారా వైఫై సౌకర్యం కల్పించి, డిజిటల్ లిట్రసీ (సాంకేతిక అక్షరాస్యత)ని పెంచాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే 2023లో రాష్ట్రవ్యాప్తంగా 1902 ప్రభుత్వ పాఠశాలలు, 493 ఎంఆర్సీలు, 10 డైట్ కేంద్రాల్లో ఐసీటీ ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. కంప్యూటర్లను మంజూరు చేశారు. ఒక్కో పాఠశాలకు, డైట్ కేంద్రానికి, మండల రిసోర్స్ కేంద్రానికి రూ.2.40లక్షలు కేటాయించారు.
సమగ్ర శిక్ష పథకంలో భాగంగా మైక్రోకేర్ కంప్యూటర్స్ కంపెనీ వారు జగిత్యాల జిల్లాలోని పాఠశాలలకు గతేడాది నవంబర్‌లో కంప్యూటర్లను పంపిణీ చేశారు. ఒక్కో స్కూల్‌కు ఐదేసి చొప్పున చేరుకున్నాయి. జిల్లాలో అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్ మొత్తం 93 స్కూళ్లకు 465 కంప్యూటర్లు చేరాయి. పది మండల రిసోర్స్ సెంటర్లకు ఐదేసి చొప్పున 75 వచ్చాయి. మొత్తంగా 540 కంప్యూటర్లు విద్యా సంస్థలకు చేరాయి. నిబంధనల ప్రకారం పరిశీలిస్తే ప్రభుత్వం నుంచి ఆర్డర్ పొందిన కంప్యూటర్ సైప్లె సంస్థ ప్రింటర్స్, కంప్యూటర్ ఇన్స్టాలేషన్, ప్రోగ్రామింగ్, ఐదేండ్ల పాటు మెయింటనెన్స్ నిర్వహించాలి. కంప్యూటర్లతో విద్యార్థులకు స్మార్ట్ తరగతి గదులను రూపొందించి, పిల్లల డిజిటల్ లిట్రసీ రేటును పెంచాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ పాఠశాలలోని ప్రతి విద్యార్థి కంప్యూటర్‌పై అవగాహన పెంచుకోవడంతో పాటు, ప్రత్యక్షంగా తర్ఫీదు పొందడం, ప్రోగామింగ్, డిజిటల్ అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇక డైట్ కాలేజీలతో పాటు, మండల రిసోర్స్ కేంద్రాలకు ఇచ్చిన కంప్యూటర్లతో విద్యాశాఖ నిర్దేశించిన లక్ష్యాలు, రికార్డులన్నింటినీ కంప్యూటరైజ్డ్ చేయించి స్మార్ట్ పరిపాలన వ్యవస్థను సృష్టించాలని భావించింది.
జిల్లా వ్యాప్తంగా గతేడాది నవంబర్‌లో 93 పాఠశాలలకు చేరిన కంప్యూటర్లన్నీ నిరుపయోగంగా పడి ఉన్నాయి. 90 శాతం పాఠశాలల్లో కంప్యూటర్లను కనీసం అట్టబాక్స్ల నుంచి బయటకి సైతం తీయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కంప్యూటర్లతోపాటు ప్రింటర్లు రావాల్సి ఉండగా, ఇప్పటికీ రానే లేదు. ఇక నిబంధనల ప్రకారం కంప్యూటర్లలో ప్రోగ్రామింగ్ చేసి, ఇన్స్టాలేషన్ చేయాల్సిన బాధ్యత సైతం కంప్యూటర్లు పంపిణీ చేసిన మైక్రోకేర్ సంస్థదే. అయితే ఇంత వరకు ఆ కంపెనీ ప్రతినిధులు పాఠశాలలకు వచ్చి కంప్యూటర్లను ఇన్స్టాలేషన్ చేయనేలేదు. కంప్యూటర్లను అమర్చేందుకు టేబుల్స్ రానేలేదు. అన్నింటి కంటే ముఖ్యంగా కంప్యూటర్లు, స్మార్ట్ తరగతుల నిర్వహణ, డిజిటల్ బోధన, పిల్లలకు శిక్షణకు కావాల్సిన వైఫై సౌకర్యం ఏర్పాటు చేయలేదు.
జిల్లాలోని 93 పాఠశాలలకు ఏడాది క్రితం ఐదేసి కంప్యూటర్లు ఎందుకు ఇచ్చారో తమకు తెలియడం లేదని, ఏ పద్ధతిలో వాటిని వాడుకోవాలో..? వాటికి సంబంధించిన నియమ నిబంధనలు ఏంటో సైతం తెలియదని, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఆయా స్కూళ్ల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పేర్కొంటుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సరఫరాదారు కంప్యూటర్లను ఇన్స్టాల్ చేయలేదని, అలాగే ప్రింటర్స్‌ను సైతం తమకు అప్పగించలేదని, ప్రోగ్రామింగ్, ఇన్స్టాలేషన్ లేకపోవడం, టేబుల్స్ సైతం పంపిణీ చేయకపోవడంతో కంప్యూటర్లను బాక్స్‌లోంచి బయటకు తీసే ప్రయత్నం చేయలేదని చెబుతున్నారు. కాగా, ఇదే విషయమై విద్యాశాఖ అధికారులను ప్రశ్నించగా, పాఠశాలలకు కంప్యూటర్లు ఎందుకు వచ్చాయో తమకు తెలియదని సమాధానం చెబుతున్నారు. వాటిని ఎందుకోసం పంపిణీ చేశారు..? ఎలా వినియోగించాలి..? వాటి కరిక్యులమ్ ఏంటీ..? అన్న విషయం తమకు తెలియదని, ఎలాంటి ఉత్తర్వులు రాలేదని చెబుతున్నారు.
ఏడాది క్రితం పంపిణీ చేసిన కంప్యూటర్లు నిరుపయోగంగా పడి ఉండేందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పలువురు ప్రభుత్వ టీచర్లు అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వం పిల్లల్లో డిజిటల్ లిట్రసీని పెంచేందుకు కంప్యూటర్లు, ప్రింటర్‌ను మంజూరు చేసింది. ఐదు కంప్యూటర్లు, ప్రింటర్, మెయింటెయినెన్స్ కోసం ప్రతి యూనిట్‌కు రూ.2.40లక్షలు ఖర్చు చేసింది. కంప్యూటర్ల పంపిణీ జరిగిన నెల రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం మారిపోయింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం డిజిటల్ లిట్రసీపై దృష్టిపెట్టాల్సి ఉండగా, దానిపై శీతకన్ను వేసిందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన కంప్యూటర్లను ఇప్పటికైనా ఇన్స్టాలేషన్ చేయించి, ప్రోగ్రామింగ్ ఏర్పాటు చేసి, పాఠశాలలకు వైఫై సౌకర్యంతో పాటు, కంప్యూటర్లను అమర్చుకునేందుకు టేబుల్స్‌ను ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంత పిల్లలకు ప్రయోజనం చేకూరుతుందని, లేకుంటే పరిస్థితి ఇలాగే కొనసాగితే పంపిణీ అయిన కంప్యూటర్లు పూర్తిగా చెడిపోతాయని పేర్కొంటున్నారు.