గంగాధర, నవంబర్ 11 : బాలికల్లో ధైర్యాన్ని నింపి, వారికి భరోసా కల్పించడమే స్నేహిత కార్యక్రమం లక్ష్యమని, మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకే శుక్రవారం సభకు శ్రీకారం చుట్టామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మండలంలోని గర్శకుర్తిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్నేహిత-2 అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బాలికల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రతి పాఠశాలలో ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పెట్టె తాళం చెవి నోడల్ అధికారి, షీటీం దగ్గర ఉంటుందన్నారు. విద్యార్థినులు తమ సమస్యలను పేపర్‌పై రాసి పెట్టెలో వేస్తే అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. విద్యార్థినులను వేధించినా, వారితో అసభ్యకరంగా ప్రవర్తించినా ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, టోల్ ఫ్రీ నంబర్లు 1098, 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
కలెక్టర్ పాడిన ఏబీసీ ఆఫ్ లైఫ్ రైమ్‌లో పాల్గొన్న గర్శకుర్తి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలెక్టర్ పమేలా సత్పతి ముచ్చటించారు. ఏబీసీ ఆఫ్ లైఫ్ రైమ్ లక్నోలో నిర్వహించిన జాతీయ ఉపాధ్యాయ సదస్సులో ప్రదర్శించినట్లు తెలిపారు. విద్యార్థులతో కలిసి విలువలు తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతస్థాయిలో నిలవాలని సూచించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విటమిన్ గార్డెన్, మొక్కలను పరిశీలించారు. అనంతరం సామూహిక సీమంతం, అన్నప్రాసన కార్యక్రమాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఇక్కడ సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, షీ టీం సీఐ శ్రీలత, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, బాలికా అభివృద్ధి అధికారి కృపారాణి, తాసీల్దార్ రజిత, ఎంపీడీవో రాము, ఎంఈవో ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.