Created fake news | జగిత్యాల, ఆగస్టు 07 : మాజీ మంత్రి జీవన్ రెడ్డి పై ఫేక్ వార్తను సృష్టించి వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జగిత్యాల పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రెస్ నోట్ ని జగిత్యాల మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జగిత్యాల టౌన్ సీఐ కరుణాకర్ ను గురువారం కలిసి ఫిర్యాదు చేశారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎ జీవన్ రెడ్డి ఆగస్టు 5న విడుదల చేసిన ఒక ప్రెస్ నోట్ సంబంధించిన ఓ పత్రికకు సంబంధించి న్యూస్ వెబ్ పేజీలో ప్రచురితం కాగా, కొంతమంది దురుద్దేశ పూర్వకంగా వార్తకు సంబంధం లేని వ్యక్తి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఫోటోను జత చేసి, దురుద్దేశ పూర్వకంగా ఫేక్ వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సీఐకి వివరించారు.
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పరువుకు భంగం కలిగేలా ఫేక్ వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, మాజీ కౌన్సిలర్స్, సీనియర్ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ నుండి పట్టణ పోలీస్ స్టేషన్ వరకు నాయకులు ర్యాలీ నిర్వహించారు.