Godavarikhani | గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాల పైన సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేసినట్లు రామగుండం కార్పొరేషన్ సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య, సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజ్ పేర్కొన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు వచ్చిన రూ.16కోట్ల స్టాంపు డ్యూటీ నిధులను దారి మళ్లించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు కేటాయించి వాటిని ఎవరు టెండర్ వేయకుండా ఏడుగురు కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులను అప్పగించారని ఆరోపించారు. కేవలం వారికి కేటాయించి అవినీతి జరిగే విధంగా చేశారని విమర్శించారు. రూ.75-77కే జరగాల్సిన పనిని రూ.99కి టెండర్ ఖరారు చేసి దాదాపు 22శాతం నిధుల అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. యూజీడీ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులు జరిగాయని, దీనిపైన చర్యలు తీసుకోకపోవడం నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీలకు జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
రామగుండం కార్పొరేషన్ లో స్థానిక కాంట్రాక్టర్ల కడుపులు కొడుతూ ప్రతీ పనిని హైదరాబాదులో ఖరారు చేసి 10 నుండి 12శాతం కమిషన్ తీసుకొని స్థానిక ఎమ్మెల్యే హైదరాబాద్ కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్తున్నారని ధ్వజమత్తారు. వెయ్యి రోజుల పాలనలో నీతిగా నిజాయితీగా పాలన కొనసాగిస్తున్నామని, ప్రజలకు రక్షణగా ఉంటూ అభివృద్ధి చేస్తామని గొప్ప గొప్ప మాటలు చెప్పిన ఎమ్మెల్యే రామగుండంలో అత్యంత అవినీతికి పాల్పడుతున్నాడని నాయకులు ఆరోపించారు. రామగుండం కార్పొరేషన్ లో ప్రతీ కాంట్రాక్టుకు ఇంత అని చెప్పి కమిషన్ ఫిక్స్ చేసిన తర్వాతనే కాంట్రాక్టులు కాంట్రాక్టర్లకు అప్పజెప్పతున్నట్లు ఆరోపించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లో జరిగిన అవినీతే మీ నీతికి నిలువుటద్దమని వారన్నారు. రక్షకుడిగా ఉంటాను అన్న ఎమ్మెల్యే రామగుండం ప్రజలను రక్షించకున్నా.. పర్లేదు కానీ దయచేసి వారిని భక్షించకండి అని కోరారు. ఈడీ, సీబీఐకి ఫిర్యాదు చేసిన తరుణంలో రామగుండం మున్సిపల్ కమిషనర్ ఆ ఏడు ప్యాకేజీలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వాళ్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని, నాణ్యత ప్రమాణాల పైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు తాళ్లపల్లి మల్లయ్య, నగర నాయకులు శనిగరపు చంద్రశేఖర్, ఆసాల నవీన్, అబ్దుల్ కరీం, రాణవేణి సుధీర్ కుమార్, సాధుల శివ, పోతరాజు నాగరాజు, శనిగరపు తిరుమల తదితరులు పాల్గొన్నారు.