CPM | కరీంనగర్, తెలంగాణ చౌక్, ఏప్రిల్ 11 : అకాల వర్షం తో నష్టపోయిన రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని ముకుంద లాల్ మిశ్రా భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో గురు, శుక్రవారాల్లో అకాల ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానతో దెబ్బతిన్న అన్ని రకాల పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆపదలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతల జీవితాలను అతలాకుతలం చేసిందని వాపోయారు. చేతికి వచ్చే స్థితిలో మొక్కజొన్న మామిడి, వరి పంటలు నేలకొరిగాయని, వడగండ్ల వర్షానికి వడ్లు, మామిడికాయలు రాలిపోయాయని తెలిపారు. మొక్కజొన్న పంట నేల వాలిందన్నారు. జిల్లాలో గన్నేరువరం, ఇల్లందకుంట మండలాల్లోని పలు గ్రామాల రైతులు ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి నెలకొందన్నారు.
ఆరుగాలం కష్టపడి అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి పంట సాగు చేసిన రైతులు కళ్ళముందే పంట నేల పాలైతే రైతన్న గుండె తరుక్కుపోతుందన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరి అగమ్య గోచరంగా తయారైందని, కౌలుకు భూములు తీసుకొని పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చే సమయంలో నోటికాడి బువ్వ లాక్కున్నట్టు అయిందన్నారు. అకాల వడగండ్ల వర్షాలతో అన్నదాతకు తీరని నష్టం వాటిలిందన్నారు. జిల్లాలో కురిసిన వడగళ్ల వాన, గాలి బీభత్సానికి సుమారు 500 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు సమాచారం వుందన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి సరైన నివేదిక ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మొక్కజొన్న పంటకు ఎకరానికి 60 వేలు, వరి పంటకు ఎకరానికి 70 వేలు, మామిడి పంటకు ఎకరానికి 80వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటల బీమా పథకం లేకపోవడంతో రైతులు ప్రతి సంవత్సరం అకాల వర్షాలు, ఈదురు గాలుల మూలంగా పెద్ద ఎత్తున నష్టపోతూనే ఉన్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పంటల బీమా పథకాన్ని సర్వేనెంబర్ యూనిట్ గా ప్రతీ పంటకు వర్తింపజేయాలన్నారు.