 
                                                            Chigurumamidi | చిగురుమామిడి, అక్టోబర్ 31: తుఫాన్ కారణంగా చేతికి వచ్చిన పరిపంట పూర్తిగా నేలపాలు కావడంతో రైతన్నలు కన్నీరు పర్యంతమవుతున్నారని, ప్రతీ పంటకు ఎకరా రూ.30వేలు నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో చిన్న ముల్కనూర్ గ్రామంలో దెబ్బతిన్న పంటలను బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం పరిశీలించారు. నష్టపోయిన వరి పంటకు ఎకరానికి రూ.30 వేలు ప్రభుత్వం ఇవ్వాలని, తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
బోనస్ డబ్బులు ఇంతవరకు రాలేదని, వాటిని తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పూర్తిస్థాయిలో రైతులందరికీ అందలేదని, కౌలు రైతులను సైతం ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన గ్రామాల వారిగా వరి పంటలు పరిశీలిస్తామని, అన్ని గ్రామాల్లో పూర్తిస్థాయిలో పంట చేతికి రాకుండా పోయిందని వాపోయారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, కనీసం రైతులైన ఆదుకోవాలని వారు కోరారు. పంటలను పరిశీలించిన వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, ఆర్బీఎస్ జిల్లా మాజీ సభ్యుడు సాంబారి కొమురయ్య, బీఆర్ఎస్ నాయకులు పేసరి రాజేశం, బరిగెల సదానందం, కయ్యం సారంగం, గుండ నరసయ్య, మారెళ్ళ కొమురయ్య, భూస ఐలయ్య, పందిపెళ్లి బాబు, మర్రి కుమార్, ముంజ ఐలయ్య తదితరులు ఉన్నారు.
 
                            