Veenavanka | వీణవంక, నవంబర్ 1 : తుఫాన్‌తో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.30వేల నష్టపరిహారం అందించాలని వీణవంక మండల బీజేపీ అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్ డిమాండ్ చేశారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి తహసీల్దార్ అనుపమ రావుకు శనివారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వ్యవహారం ఉందని, మొంథా తుపాను వల్ల పంట నష్టం జరిగి రైతులు కన్నీరు పెడుతుంటే కాంగ్రెస్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. తుఫాన్, అకాల వర్షాల వల్ల వీణవంక మండలంలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, పంట చేతి కచ్చే సమయానికి వేల మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయారు.
కొన్ని ప్రాంతాల్లో పంట నీట మునిగిపోతే, మరికొన్ని ప్రాంతాల్లో పంటలు కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేవారు. పంట నష్టపోయిన రైతుల బాధ వర్ణనాతీతమని, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా వరి పంట ఎకరానికి పెట్టుబడి రూ.30వేలు ఖర్చు అవుతుందని, అందుకే రైతులకు ఎకారానికి రూ.30 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
గత ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు కూడా పంట నష్టం వాటిల్లిందని, అంతకు ముందు ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలకు సుమారు వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, అపుడు వరద ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఎకరాకు రూ.పదివేల పరిహారం ప్రకటించారని, కానీ, ఆ బాధిత రైతులకు ఇప్పటి వరకు అందించిన దాఖలాలే లేవని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 23 నెలల్లో ప్రకృతి వైఫరీత్యాల వల్ల జరిగిన పంటనష్టమెంత, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయం ఎంతనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షానికి తడిసిపోయిన పంట ఏ పరిస్థితుల్లో ఉన్నా కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తాలు, తేమ, తరుగు పేరిట రైతాంగాన్ని వేధించకుండా పూర్తిస్థాయిలో పంటను కొనుగోలు చేసి, బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామిడి ఆదిరెడ్డి, గొడుగు వినోద్, లింగారెడ్డి, కొండల్ రెడ్డి, ఉడుత కుమార్, మాడ విజేందర్ రెడ్డి, బొంగోని ఎల్లా గౌడ్, కొలిపాక వెంకటేష్, స్వామి, దేవాల్ రెడ్డి, వీరాస్వామి, రాజయ్య, చేతి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి, శ్యాంసన్, మధునయ్య, కోరుకంటి రాజు తదితరులు పాల్గొన్నారు.