Sircilla | కలెక్టరేట్, జూన్ 16 : సిరిసిల్ల పట్టణంలో ఇటీవల గాలివానలు, భారీ వర్షాల కారణంగా ఇండ్లు కూలిపోయిన బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ వర్షాలకు ఇండ్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న అనేక మంది బాధితులకు ఇప్పటికీ ఆర్థిక సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన నష్టపరిహారం పూర్తిస్థాయిలో కాకపోయినా, కనీసం తక్షణ సహాయంగా ఇవ్వాల్సిన మొత్తాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయంలో ఇండ్లు కూలిన బాధితుల దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిశీలించి అర్హులైన వారికి నష్టపరిహారం విడుదల చేయాలని కోరారు.
అలాగే సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయ సూపరింటెండెంట్ భాస్కర్ రెడ్డిని బదిలీ చేయాలని కూడా కలెక్టర్‌ను కోరినట్లు వారు తెలిపారు. ఆయన చాలా కాలంగా సిరిసిల్లలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారని, ప్రస్తుతం బదిలీల సమయం కావడంతో ఇతర ప్రాంతానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కుసుమ గణేష్, సభ్యులు పోస రమేష్, ఎండీ ఇబ్రహీం, నల్ల మురళి తదితరులు పాల్గొన్నారు.