వేములవాడ, జూలై 21: రాష్ట్ర దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీల కోసం ఉన్నతాధికారులు కమిటీలు ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్జేసీ, డీసీ, ఏసీ క్యాడర్‌తోపాటు ఆలయాల స్థాయికి అనుగుణంగా ట్రాన్స్ఫర్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే ఆప్షన్లను స్వీకరించగా ఈనెల 27వ తేదీలోగా పరిశీలిస్తారు. అనంతరం 28, 29 తేదీల్లో ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇప్పటికే ఉద్యోగుల సీనియార్టీ, విధి నిర్వహణలో చేసిన తప్పులు, ఆరోపణలు తదితర వివరాలు సేకరించారు. అయితే దేనిని ప్రామాణికంగా తీసుకుంటారోనని ఉద్యోగ వర్గాల్లో ఆందోళన నెలకొన్నది.
ఆర్జేసీ టెంపుల్స్‌కు కమిషనర్ స్థాయిలో..
ఆర్జేసీ పరిధిలో ఉన్న రాష్ట్రంలోని వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం ఆలయాల ఉద్యోగుల బదిలీకి దేవాదాయ శాఖ కమిషనర్ నేతృత్వంలో అదనపు కమిషనర్, ఆర్జేసీ, సంబంధిత ఆలయాల కార్య నిర్వహణాధికారులసీఈవోలతో కమిటీ వేశారు. అయితే, తుది జాబితాను కమిషనరే రూపొందిస్తారు.
మిగిలిన డీసీ స్థాయి కొండగటు,్ట కొమురవెల్లి, బాసర టెంపుల్స్‌కు మాత్రం దేవాదాయ శాఖ కమిషనర్, అదనపు కమిషనర్, ఆర్జేసీ, సంబంధిత ఆలయాల సీఈవోలు కమిటీలో ఉంటారు. తుది నిర్ణయం మాత్రం కమిషనర్‌దే. అయితే బదిలీలకు సీనియార్టీతోపాటు ఆరోపణలను కూడా ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉండడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే అవినీతి, విజిలెన్స్ ఆరోపణలు, విధుల్లో సస్పెన్షన్ లాంటివి ఉన్న ఉద్యోగులు ఎక్కడ పోస్టింగ్ వస్తుందేమోనని మదనపడుతున్నారు.
అనారోగ్య కారణాల సాకుతో..
బదిలీ ప్రక్రియ ఆఖరి దశకు చేరుకోవడంతో బదిలీని ఆపుకునేందుకు ఉద్యోగులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అనారోగ్య కారణాలను చూపుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏండ్ల నుంచి పాతుకపోయిన ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ చేయున్నారు.
184 మందిలో 68 మందికి బదిలీ..
రాష్ట్రంలోని వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, కొండగట్టు, కొమురవెల్లి, బాసర ఆలయాలను కలిపి యూనిట్‌గా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వేములవాడలో 63, యాదగిరిగుట్టలో 67, భద్రాచలంలో 13, కొండగట్టు 22, కొమురవెల్లి 10, బాసర 9 మంది ఉద్యోగులతో కలిపి ప్రస్తుతానికి 184 ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో 40 శాతం.. 68 మంది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలున్నాయి.