Comedian Shiva Reddy | కోల్ సిటీ, సెప్టెంబర్ 21: రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సింగరేణి సహకారంతో గోదావరిఖని జవహర్ నగర్ లో గల జేఎల్ఎన్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన దసరా ఉత్సవ్-2025 వేడుకలో భాగంగా జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం ప్రముఖ సినీ హాస్య నటుడు, మిమిక్రీ ఆర్టిస్టు శివారెడ్డి సందర్శించి పరిశీలించారు. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజాకూర్ సూచనల మేరకు ఆయన స్టేడియంకు వచ్చి సింగరేణి, పోలీస్ అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు.
వేడుకల ఏర్పాట్లకు నేతృత్వం వహించారు. దసరా పండుగ రోజున జరగనున్న పెద్ద ఎత్తున జరిగే ఈ వేడుకలకు దాదాపు లక్ష మంది ప్రజలు, సింగరేణి కార్మిక కుటుంబాలు హాజరై వీక్షిస్తారని సింగరేణి ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్ తెలిపారు. వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా తమ బృందంచే ప్రదర్శనలు ఇస్తామని నటుడు శివారెడ్డి తెలిపారు. సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రజలు మంత్రముగ్ధులయ్యేలా మిమిక్రీ కళాకారులచే ప్రదర్శనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
పారిశ్రామిక ప్రాంతం నలుమూలల నుంచి ఉత్సవాలను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులకు ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలపై గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ వివరించారు. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు సమకూర్చాలని అధికారులకు శివారెడ్డి విజ్ఞప్తి చేశారు. సింగరేణి పరంగా కావల్సిన ఏర్పాట్లు సమకూరుస్తామని జీఎం తెలిపారు. వీరి వెంట పలువురు వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు ఉన్నారు.