జగిత్యాల, జూన్ 5: ఈనెల 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆదేశించారు. పట్టణంలో బుధవారం ఆమె చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 22 కేంద్రాల్లో 7692 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు.
అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచే కేంద్రంలోకి పంపించాలని సూచించారు. 10 గంటలకు ప్రధాన ద్వారం మూసి వేయాలని ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల మేరకు విధులు నిర్వర్తించాలన్నారు. విధులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల్లో వైద్య సిబ్బంది, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అదనపు ఎస్పీ వినోద్‌కుమార్, రీజినల్ కో-ఆర్డినేటర్ వేణుగోపాల్, కలెక్టరేట్ పర్యవేక్షకుడు విశ్వంభర్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాను ట్రెస్సా సభ్యులు కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ట్రెస్సా జిల్లా సభ్యులు ఎండీ వకీల్, హన్మంతరావు, విశ్వంబర్, హాకీం, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ అనిల్, సిబ్బంది పాల్గొన్నారు.