కార్పొరేషన్, మార్చి 21 : కరీంనగర్లోని ప్రజలు ఇంటి వద్దే చెత్తను రీసైక్లింగ్ చేసి రీ యూజ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి ప్రమేలా సత్పతి అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ కళాభారతిలో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ ఎక్స్పోను ఏర్పాటు చేశారు. దీనిని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటి నుండి వెలువడే ఆహార వ్యర్ధాలు, తడి, పొడి చెత్తను ఎరువుగా మార్చే యంత్రాలు, పరికరాలను వినియోగించుకోవాలన్నారు.
ప్రతి ఇంటి నుండి వెలువడే ఆహార వ్యర్థాల ద్వారా చిన్న పరికరాలతో ఎటువంటి ఖర్చు లేకుండా చెత్తను ఎరువుగా మార్చవచ్చనని పేర్కొన్నారు. వచ్చిన ఎరువును మొక్కల సంరక్షణకు వినియోగించుకోవచ్చని, తద్వారా ప్రకృతిని సంరక్షించిన వారమవుతామని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో చెత్తను ఎరువుగా మారుస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ భజ్పాయ్, నగరపాలక అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.