చొప్పదండి, డిసెంబర్ 28: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకే ప్రభుత్వం ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి శ్రీదేవసేన, జిల్లా కలెక్టర్ పమేలాసత్పతి పేర్కొన్నారు. అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురువారం ఆర్నకొండ, చాకుంటలో చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా దరఖాస్తుదారులతో మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. సర్కారు అమలు చేయనున్న ఆరు గ్యారెంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నామని చెప్పారు. జనవరి 6వ తేదీ వరకు పనిదినాల్లో గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు. ఆర్నకొండ, చాకుంట గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన శిబిరాలను ఎస్ఈ గంగాధర్ పరిశీలించారు.