కరీంనగర్ విద్యానగర్, జనవరి 13 : ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న పలువురు వైద్యులు, సిబ్బందిపై కలెక్టర్ పమేల సత్పతి కొరడా ఝులిపించారు. కొంత కాలంగా ఒకవైపు ప్రజాప్రతినిధులు, మరోవైపు వైద్య అధికారుల నుంచి పరస్పరం వెల్లువెత్తుతున్న ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. కొద్ది రోజుల క్రితం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ప్రభుత్వ దవాఖాన సిబ్బంది పనితీరుపై ఫిర్యాదు చేయగా, ఇదే సమయంలో ప్రజాప్రతినిధులపై వైద్య సిబ్బంది ఒకరు ఫిర్యాదు చేశారు.
ఈ పరిస్థితులను కలెక్టర్ పరిగణలోకి తీసుకొని, జిల్లా వైద్యాధికారి లలితాదేవితో విచారణ జరిపించారు. ఆ మేరకు ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ కృష్ణ ప్రసాద్, పిల్లల వైద్యుడు డాక్టర్ అజయ్‌కుమార్, ఫిజీషియన్ వైద్యుడు డాక్టర్ కనకం శ్రీనివాస్‌కు షోకాజ్ నోటీసులు అందజేశారు. ఆఫీస్ సూపరింటెండెంట్, ఆఫీస్ ఏవో, సంబంధిత క్లర్క్‌లకు మెమోలు జారీ చేశారు. ఆర్ఎంవో డాక్టర్ జ్యోతిని జమ్మికుంటకు పంపిస్తూ వర్క్ ఆర్డర్‌తోపాటు మెమో ఇచ్చారు. షోకాజు నోటీసులు, మెమోలకు వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దవాఖానకు పూర్తి స్థాయిలో డీసీహెచ్ఎస్ను నియమించాలని కమిషనర్‌కు లేఖ రాసినట్లు తెలిసింది.