కలెక్టరేట్, మార్చి 26 : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, పురోగతి, బాధితులకు చెల్లించా ల్సిన పరిహారం తదితర అంశాలపై జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగింది. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావే శంలో నమోదైన అట్రాసిటీ కేసులు, పరిష్కరించిన కేసులు, బాధితులకు అందిన పరిహారం గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కేసు పూర్వాపరాలను పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగే విధంగా అధికారులు చర్య తీసుకోవాలని అన్నారు. కేసుల్లో భాగంగా అవసరమైన కుల ధ్రువీకరణ పత్రం వీలైనంత త్వరగా జారీ చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మానిటరింగ్ కమిటీ సభ్యులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. చింతకుంటలోని అంబేద్కర్ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని, భగత్ నగర్లో కేటాయించిన స్థలానికి ప్రహరీ గోడ నిర్మించాలని సభ్యులు కోరారు. కోర్టు చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం కూడలి శుభ్రంగా ఉంచాలని కోరారు.
ఈ అంశాలను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీ సభ్యులకు కోరగా ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ తెలిపారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల విషయంలో త్వరిత గతిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎఫ్ఐఆర్, చార్జిషీట్, పరిష్కారం అయిన కేసులు, విచారణలో ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను సంవత్సరం వారీగా వెల్లడించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేష్, డిటిడిఓ జనార్ధన్, బీఎండబ్ల్యూ పవన్ కుమార్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్ ప్రకాష్, ఏసిపి వెంకటస్వామి పాల్గొన్నారు.