కలెక్టరేట్, ఏప్రిల్ 21 : జిల్లాలో ఓటరు నమోదు జాబితాలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పూర్తి చేసి, నివేదికలు పంపాలని సంబంధితాధికారులను జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి ఆదేశించారు. ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల రిటర్నింగ్ అధికారులతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించాలని సూచించారు.
నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లాలోని ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు నిరంతరాయంగా విధులు నిర్వహించాలన్నారు. ఎనిమిది గంటలకో టీమ్ చొప్పున 24 గంటల పాటు పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలోని చెక్‌పోస్టులు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు అవసరమైన సిబ్బంది ఉండాలన్నారు. జిల్లాలోని పరిస్థితులపై ఏఆర్వోలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన చర్యలకు నివేదికలందించాలన్నారు. సమావేశంలో కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ల ఆర్వోలు కే మహేశ్వర్, ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, రమేశ్‌బాబు పాల్గొన్నారు.