కలెక్టరేట్, ఫిబ్రవరి 13 : స్థానిక సంస్థల ఎన్నికల నగారా ఎప్పుడు మోగినా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి(Pamela Satpathi )అన్నారు. పంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణపై రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారుల పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. ఎన్నికల విధులు అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నియమ, నిబంధనలపై స్పష్టమైన అవగాహన ఉన్నపుడే ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఉంటుందన్నారు.
ఎన్నికల సంఘం అందించిన కరదీపికను రిటర్నింగ్ అధికారులు తప్పనిసరి చదవాలని స్పష్టం చేశారు. ఈసీ మార్గదర్శకాల మేరకు సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని, ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి నివృత్తి చేసుకోవాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పార్టీ గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ విధానం, ఓట్ల లెక్కింపు, ఎన్నికల నియమావళి, తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్లు దేవి శ్రీనివాస్, టి.సంపత్, ఆర్.రవీందర్, పరశురాములు ఆర్వోలు, ఎఆర్వోలకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డిపివో పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.