పెద్దపల్లి, జనవరి 26(నమస్తే తెలంగాణ): అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్నదని పెద్దపల్లి కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ పేర్కొన్నారు. స్వాతం త్య్రం సిద్ధించిన తర్వాత రాజ్యాంగాన్ని రచించుకొని అమల్లోకి వచ్చిన రోజు రిపబ్లిక్ డే వేడుకలను జరుపుకొంటున్నామని చెప్పారు. పెద్దపల్లి కలెక్టరేట్ ఆవరణలోని పరేడ్‌గ్రౌండ్‌లో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్ జాతీయ జెండా ను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత మాట్లాడారు. గతేడాది అసెంబ్లీ, సింగరేణి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకున్నామన్నారు.
సర్కారు తెచ్చిన మహాలక్ష్మీ పథకంలో భాగంగా జిల్లాలో 7.8 లక్షల మంది మహిళలు జీరో టికెట్‌తో ఉచిత బస్సు ప్రయాణం చేశారని తెలిపారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని 10లక్షలకు పెంచామని, 1339 మంది దీనిని వినియోగించుకున్నారని పేర్కొన్నారు. మహాలక్ష్మీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, గృహజ్యోతి లాంటి ఐదు గ్యారెంటీలకు అర్హుల ఎంపిక కోసం ప్రజాపాలన ద్వారా 2.4 లక్షలు దరఖాస్తులు స్వీకరించామని చెప్పారు.
అర్జీలన్నింటినీ ఆన్లైన్ చేశామని వెల్లడించారు. కలెక్టరేట్‌తోపాటు డివిజన్, కార్పొరేషన్ వారీగా ప్రజావాణి నిర్వహిస్తూ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులను లాభాదాయక పంటల సాగు దిశగా ప్రోత్సహించేందుకు రైతు వేదికల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. గత వానకాలం 415 కోట్లకు పైగా విలువైన 1,88,918 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు.
డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. సర్కారు స్కూళ్లల్లో నాణ్యమైన భోజనం, మెరుగైన విద్యనందించేందుకు ప్రతి బుధవారం ‘లంచ్ అండ్ లెర్న్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. వచ్చే పదోతరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధనకు పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తున్నామని తెలిపారు. జిల్లాలోని చారిత్రక ప్రాంతాలను గుర్తించి వాటి ఔన్నాత్యాన్ని ప్రజలకు తెలియజేస్తామన్నారు. పెద్దపల్లిలోని రామగిరి ఖిల్లాను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. కాగా రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధులను కలెక్టర్, ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి కలెక్టర్ ఘనంగా సన్మానించారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.