Health tips : చాలామంది ఆల్కహాల్ (Alcohal) మాత్రమే ఆరోగ్యానికి హాని చేస్తుందని అనుకుంటారు. కానీ మనం తీసుకునే పానీయాల్లో కొన్ని ఆల్కహాల్ కంటే ఎక్కువగా ఆరోగ్యానికి హాని తలపెడుతాయి. ముఖ్యంగా కిడ్నీల (Kidneis) పనితీరును దెబ్బతీస్తాయి. అయితే ఏ పానీయం ఎక్కువ హాని చేస్తుందో.. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు కూడా ఒక భాగం. కిడ్నీలు ఫిల్టర్లుగా పనిచేస్తాయి. అంతే కాదు శరీరం నుంచి వ్యర్థాలు, విషాన్ని తొలగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తోడ్పడుతాయి. అందుకే మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి అలసట, వాపు, వికారం, శ్వాసలోపం, రక్తహీనత, రక్తపోటు పెరుగుదల, నిద్రలేమి లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఎందుకంటే కిడ్నీలు శరీరంలోని దాదాపు ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం శరీర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే దూరం పెట్టాల్సిన డ్రింక్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా ఎనర్జీ డ్రింక్స్ కిడ్నీలకు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని, వాటికి దూరంగా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో ఎనర్జీ డ్రింక్స్ తాగేవారి సంఖ్య పెరుగుతోంది. తరచూ ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడంవల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. అంతేకాదు ఈ డ్రింక్స్ కిడ్నీలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎనర్జీ డ్రింక్స్ గురించి హెచ్చరించింది. ఇక మూత్రపిండాల సమస్యలు ఉన్నవాళ్లైతే ఆ ఎనర్జీ డ్రింక్స్ జోలికి అస్సలే వెళ్లకుండా ఉండటం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఎనర్జీ డ్రింక్స్‌ను దూరం పెట్టడంతోపాటు రోజూ కావాల్సిన నీళ్లు తాగడం ద్వారా మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం కూడా మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు. అల్లం నీరు, హెర్బల్ టీ తాగడం ద్వారా కూడా మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు.