Telangana Model School | ధర్మారం, సెప్టెంబర్ 17 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో వినూత్న కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు ప్రతిభను కనబరిచిన నేపథ్యంలో ఆ పాఠశాల విద్యార్థులను పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం అభినందించారు. ఈ పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్నకలెక్టర్ పాఠశాల విద్యార్థులను, పాఠశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ కలెక్టరేట్ కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజకుమార్ పాఠశాలలో చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ కు వివరించారు.
ప్రతీ రోజు మధ్యాహ్నం భోజనం సమయంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులందరూ విద్యార్థులతో కలిసి మీల్స్ విత్ స్టూడెంట్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన సమయం లో కూడా విద్యార్థులందరికీ పలు సామాజిక అంశాల పైనా అవగాహన కలిగేలా విద్యార్థులే రేడియో జాకీ 674.26, గ్రీన్ రేడియో ఎఫ్ఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన కలెక్టర్ కు వివరించారు.
పర్యావరణాన్ని కాపాడే లక్ష్యం తో విద్యార్థులందరికీ వనరుల వినియోగం, ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణ కోసం ప్లాస్టిక్ రహిత ఆదర్శ పాఠశాల అను కార్యక్రమం, ప్రతీ నెల విద్యార్థులు సాధించిన విజయాలతో ఫోటో విత్ మంత్లీ మ్యాగజైన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా క్రీడలలో ధర్మారం ఆదర్శ పాఠశాల చురుకుగా పాల్గొంటుందని చెప్పారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ క్రీడల్లో పాల్గొనడానికి ఆసక్తి కలగడానికి ప్లే ఫర్ ఆల్ కార్యక్రమం చేపడుతున్నట్టు ఆయన వివరించారు.
పాఠశాలలో నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమాల ద్వారా విద్యార్థుల హాజరు శాతంతో పాటు ప్రవేశానికి కూడా పెరిగాయని ప్రిన్సిపల్ కలెక్టర్ కు వివరించారు. విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రిన్సిపల్ ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశంసించారు. ప్రిన్సిపాల్ వినతి మేరకు త్వరలో పాఠశాలను సందర్శిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ప్రిన్సిపల్ వివరించారు.