తెలంగాణ చౌక్/వేములవాడ/కోనరావుపేట/రుద్రంగి/ఇల్లంతకుంట, మార్చి 18: పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు జిల్లా విద్యాధికారి ఏ రమేశ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 35 పరీక్షా కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా ఇందులో 6,475 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 6,469 మంది హాజరు కాగా, ఆరుగురు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరిగింది. విద్యార్థులను గంట ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పోలీస్ అధికారులు బందోబస్తు నిర్వహించారు.
పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. సోమవారం వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన అదనపు కలెక్టర్ గౌతమితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సౌకర్యాలపై ఆరా తీశారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎవరూ సెల్ ఫోన్ తీసుకుని వెళ్లకుండా పకడ్బందీగా చెక్ చేయాలని సూచించారు.