రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీతోపాటు వేములవాడ సబ్ ట్రెజరీ కార్యాయాల్లో జరుగుతున్న అవినీతి బాగోతంపై సోమవారం ‘నమస్తే తెలంగాణ’ కథనం సంచలనం రేపింది. మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీయడంతో అడ్డదారులు తొక్కిన అధికారుల్లో వణుకు మొదలైంది. ఏజీ కార్యాలయం నుంచి తీసుకున్న వివరాలతో సదరు అధికారులు, బాధితులతో నేరుగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే కొంత మందితో మాట్లాడగా.. ప్రతి ఒక్కరూ తమకు జరిగిన అన్యాయం, లంచాల వసూలు, కాలయాపనతో పడిన తిప్పలను పూసగుచ్చినట్టు చెప్పడంతోపాటు మరికొంత మంది బాధిత రిటైర్డ్ ఉద్యోగుల వివరాలను సైతం అందిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. మొత్తంగా ఈ వ్యవహారంలో తీగ లాగితే డొంకంతా కదులుతుండగా.. ఇన్నాళ్లూ ఫైల్ అప్‌లోడ్‌కు నిలబెట్టి వసూళ్లు చేసిన అధికారుల్లో అలజడి రేగుతున్నది.
కరీంనగర్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలోని పలు ట్రెజరీ, సబ్ ట్రెజరీ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్‌గా మారుతున్నాయి. ప్రధానంగా రిటైర్డ్ ఉద్యోగుల ఫైల్ అప్లోడ్ చేసేందుకు ఒక్కొక్కరి వద్ద 5వేల నుంచి 10 వేల దాకా నిలబెట్టి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ము ఖ్యంగా సిరిసిల్ల జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీ, వేములవాడ సబ్ ట్రెజరీ కార్యాలయాలపై ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘అవినీతికి కేరాఫ్‌గా ట్రెజరీ కార్యాలయాలు’ శీర్షికన ప్రచురించిన కథనం సంచలనం సృ ష్టించింది. ప్రధానంగా రెండు ప్రాంతాల ట్రెజరీ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల్లో కలకలం రేపింది. ఇన్నాళ్లూ ఫైల్ అప్లోడ్ చేసేందుకు నిలబెట్టి వసూళ్లు చేసిన అధికారుల్లో వణుకు మొదలు కాగా, బాధిత ఉద్యోగులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధులను స్వయంగా కలిసి, మీ కథనం నూటికి నూరుపాళ్లు నిజమని చెప్పడంతోపాటు లంచాలు తీసుకోవడమేకాకుండా, ఫైల్ ముట్టేందుకు ముప్పుతిప్పులు పెట్టారని సదరు అధికారుల పేర్లతోసహా చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. అడిగినంత ఇచ్చినా ఫైల్ అప్లోడ్ చేసేందుకు నానా తంటాలు పడ్డామని ఓ ఉద్యోగి వివరించారు.
ఓవైపు ‘నమస్తే’ కథనం అధికారుల్లో వణుకు పుట్టించగా, మరోవైపు ఇంటెలిజెన్స్ అధికారులు వివరాలు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా అధికారులు అందుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై మొత్తం నిఘా వర్గానికి చెందిన ముగ్గురు అధికారులు రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. అంతేకాదు, సదరు అధికారులు.. సిరిసిల్ల, వేములవాడ ట్రెజరీ ఆఫీస్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు ఓ అధికారి తెలిపారు. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో మార్చి నుంచి పదవీ విరమణ పొంది ట్రెజరీ ద్వారా అప్లోడ్ చేసిన రిటైర్డ్ ఉద్యోగుల వివరాలను సదరు అధికారుల బృందం ఏజీ కార్యాలయం నుంచి తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఆ మేరకు సదరు రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి వివరాలు ఆరా తీస్తున్నారు. సోమవారం ఉదయం పది గంటల నుంచే ఈ విచారణ ప్రక్రియ ప్రారభించినట్టు తెలుస్తుండగా..
బయటకు వస్తున్నట్టు ఓ అధికారి ద్వారా తెలుస్తున్నది. ముందుగా సిరిసిల్లలో ఉన్న ఓ రిటైర్డ్ ఉద్యోగికి ఫోన్ చేయగా.. ఆయన మొత్తం వివరాలు చెప్పి తనతోపాటు ఇబ్బందులకు గురైన, అలాగే లంచాలు సమర్పించుకున్న మరో ముగ్గురు రిటైర్డ్ ఉద్యోగుల పేర్లు ఇచ్చినట్టు సమాచారం. దీంతో సదరు రిటైర్డ్ ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించగా.. వారు కూడా పూసగుచ్చినట్టు వివరించినట్టు తెలుస్తున్నది. లంచాలు ఇవ్వక ముందు పడిన తిప్పలు, ఫైల్ పెడింగ్ పె ట్టిన తీరు, అమర్యాదగా మాట్లాడిన తీరు, లంచా లు ఇచ్చిన తర్వాత కూడా ఫైల్ అప్లోడ్ చేయడానికి తీసుకున్న సమయం వంటివి వివరించారని, వాళ్లు చెబుతున్నవి వింటుంటే తామే ఆశ్చర్యానికి లోనవుతున్నామని ఓ అధికారి తెలిపా రు. ఒక రిటైర్డ్ అధికారికి ఫోన్ చేస్తే.. వాళ్లే మరో ఐదు నుంచి ఆరుగురి పేర్లు ఇస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ విచారణ మరో రెండు రోజులపాటు కొనసాగనున్నట్టు తెలిసింది. బాధితుల నుంచి వచ్చే వివరాలతో నివేదికను తయారు చేసి.. విచారణకు ఆదేశించిన అధికారులకు సమర్పిస్తామని, అక్కడి నుంచి ప్రభుత్వానికి, సంబంధిత శాఖలకు తమ రిపోర్టు వెళ్తాయని సదరు అధికారి తెలిపారు. అయితే ఈ వ్యవహారాన్ని ఇక్కడితోనే ఆపేందుకు కొంత మంది ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. వివరాలు బయటకు వస్తే.. చాలా మందిపై క్రమశిక్షణ చర్యలుంటాయని తెలుసుకొని, ఎలాగైనా సరే విచారణ ముందుకెళ్లకుండా విశ్వప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే బాధితులు మాత్రం తమ వద్ద అకారణంగా వసూళ్లకు పాల్పడిన సిబ్బందిపై వేటు పడాల్సిందేనంటూ తెగేసి చెప్పడం గమనార్హం.