రాజన్న సిరిసిల్ల, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ప్రతిపక్ష నేతలకు శాపంగా మారింది. నిరసనల భయం, ముఖ్యమంత్రిని ఎక్కడ అడ్డుకుంటారోనన్న అనుమానంతో అర్ధరాత్రి నుంచే నిర్బంధకాండ సా గింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రధానంగా సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో ఎక్కడికక్కడే ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమైన బీఆర్ఎస్, ఇతర ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను వారి ఇంటి నుంచే బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నేతన్నలకు శాశ్వత ఉపాధి కల్పించాలని, సంక్షోభం ఉన్న కాటన్ వస్త్ర పరిశ్రమకు చేయూత నివ్వాలని కోరుతున్న వస్త్ర పరిశ్రమ యజమానులను సీఎం ను కలిపిస్తామంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు చెప్పా రు. వారి మాటలు నమ్మిన పరిశ్రమ యజమానులు వేములవాడకు వెళ్లేందుకు సిద్ధం కాగా, వి షయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని సిరిసిల్ల స్టేషన్‌కు తరలించారు. అందులో బీజేపీ నేతలు ఆడెపు రవీందర్, గౌడ వాసు, సైజింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌడ సురేశ్‌తో పాటు ఇతర యజమానులందరినీ అరెస్టు చేశారు. పంచాయతీల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని నెల రోజులుగా ఆందోళన చేస్తున్న మాజీ సర్పంచుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన అధికార పార్టీ నేతలు మాట మార్చారు.
సీఎం సభకు వెళ్లి సమస్యలు మొరపెట్టుకుందామనుకుని సిద్ధమైన మాజీ సర్పంచులను సైతం అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. ఇక విలీన గ్రామాల జేఏసీ నాయకులను సైతం అరెస్టు చేశారు. జిల్లాలోని 13 మండలాలకు చెందిన బీఆర్ఎస్, ఇతర పార్టీలు, ఉద్యమ నేతలందరినీ అర్ధరాత్రి నుంచే అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, పార్టీ సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్, కౌన్సిలర్లు, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, ఇల్లంతకుంట, చందుర్తి, కోనరావుపేట, వేములవాడ మండలాలే కాకుండా జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఇతర మండలాలకు చెందిన ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులు, మాజీ సర్పంచులందరినీ ఉదయం నాలుగు గంటల నుంచే అరెస్టు చేశారు. కనీసం ముఖం కడుక్కోనివ్వకుండా, స్నానం చేయనీవకుండా తీసుకెళ్లి, సీఎం పర్యటన ముగించుకొని జిల్లా సరిహద్దు దాటే దాకా ఇంటికి పంపించలేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనల భయంతో బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఖండించారు. ప్రజాపాలనలో నిరసనలు చేసే స్వేచ్ఛనిస్తామని చెప్పి అరెస్టు చేయ డం విడ్డూరంగా ఉందని అన్నారు.