జగిత్యాల రూరల్, నవంబర్ 20: సీఎం రేవంత్ రెడ్డి తిట్ల పురాణానికి బ్రాండ్ అంబాసిడర్ అని, ప్రజలు చీదరించుకునేలా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎద్దేవా చేశారు. రేవంత్ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని మాట్లాడుతున్నాడని, అంతకుముందు మహిళలకు ఇస్తానన్న 2500, ఆడబిడ్డల వివాహానికి తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బుధవారం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. స్వరాష్ట్ర సాధకుడైన కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా, మాట వినిపించకుండా చేస్తా’ అంటూ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం సరికాదని హితవు పలికారు. మీ దుర్మార్గమైన పాలనను ప్రజలంతా గమనిస్తున్నారని, తొందర్లోనే నీ ఆనవాళ్లు లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ, సాగు నీటి కోసం కాళేశ్వరం, తాగునీటి కోసం మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులను నిర్మించి, రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. రెండుసార్లు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చిన ప్రజలు ఒకసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే పాలన చేతకాక కేసీఆర్‌ను దూషించడం సరికాదన్నారు. ఇప్పటికైనా దూషణలు మంచి సుపరిపాలన చేయాలని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని హితవు పలికారు.
జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ఇష్టానుసారం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ప్రశ్నించేవాళ్లు ఉండవద్దని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి విషయాన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, కేసీఆర్ అంటేనే సీఎం రేవంత్ వణికిపోతున్నాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచే బీఆర్ఎస్ అధినేతపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌ను ప్రజల గుండెల్లోంచి తొలగించడం, ఆనవాళ్లు లేకుండా చేయడం మీ వల్ల కాదు కదా..? మీ జేజమ్మ వల్ల కూడా కాదని హెచ్చరించారు. కేసీఆర్ పోరాడి రాష్ట్రాన్ని సాధించడం వల్లే ఈ రోజు మీరు సీఎం కుర్చీలో కూర్చున్నారనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో అన్ని పార్టీల మద్దతు కూడా గట్టి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌పై సీఎం రేవంత్ వరంగల్ పర్యటనలో అసభ్య పదజాలంతో మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పరిపాలన అనుభవం లేక రాష్టాన్ని ఆగంపట్టించారని, ఇప్పటికైనా తిట్ల దండకం మాని పరిపాలనపై దృష్టి పెడితే బాగుంటుందని సూచించారు. కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు, రాష్ట్ర మార్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, మాజీ జడ్పీటీసీలు రాంమోహన్ రావు, కోల్ముల రమణ, నాయకుడు సత్యంరావు, తదితరులు పాల్గొన్నారు.