Putta madhukar | మంథని, ఏప్రిల్ 11: తెలంగా రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు దోపిడీ పాలన చేస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజమెత్తారు. సామాజిక సాంఘీక విప్లవ కారుడు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మంథని పట్టణంలో పూలే విగ్రహానికి పుట్ట మధూకర్ శుక్రవారం పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆనంతరం మహానీయుల దీక్షను స్థానిక నాయకులతో కలిసి ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన, ప్రజాపాలనను కొనసాగిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ మహానీయుల మాసంలో పోలీస్ యాక్ట్ ను అమలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాల్సింది పోయి ఆ ఉత్సవాలను జరుపుకోకుండా అణిచి వేసేలా ప్రయత్నాలు చేయడం ఎంత వరకు సమంజసమని, ఇదేనా ఇందిరమ్మ పాలన అని ప్రశ్నించారు.
పోలీసులు కేసులు పెడుతున్నారని గతంలో ప్రస్తుత మంత్రి అనేక ఆరోపణలు చేశారని, నాడు గంజాయి పెట్టించే కుట్రలు చేశారు కాబట్టే అతనిపై పోలీసులు కేసు పెట్టారనే విషయాన్ని పుట్ట మధూకర్ గుర్తు చేశారు. తమ ఆకలి, హక్కుల కోసం శాంతి యుతంగా రోడ్లపైకి వచ్చి మాట్లాడితేనే కేసులు పెడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు కాక ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవో మళ్లీ అలాంటి పరిస్థితులు వచ్చాయని, ఆంక్షలతో పరిపాలన చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేస్తుంటే తమ గొంతునొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి తెలియకుండా పాలన చేస్తున్నారన్నారు.
రాజ్యాంగం చేతిలో పట్టుకుని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ అసలు రాజ్యాంగంలో ఏం ఉందో చెప్పడం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాజ్యాంగం అనుసరించకుండా తమపై కేసులు పెట్టిస్తున్నాడని ఆరోపించారు. సంవిదాన్ బచావ్ అంటూ తిరుగుతున్న రాహుల్ గాంధీ మంథనిలో జరుగుతున్న తీరుపై స్పందించాలన్నారు. మంథనిలో సంవిధాన్ ధ్వంసం అయిందనే విషయాన్ని గ్రహించాలన్నారు.
ప్రజల ఆకలి తీర్చడం కోసం అంబేద్కర్ అందించిన ఓటు విలువ తెలిపేందుకు తుదిశ్యాస వరకు తన పోరాటం కొనసాగుతుందన్నారు. మహనీయుల దీక్ష స్వీకరించిన దీక్షాపరులు గ్రామ గ్రామాన వెళ్లి మహానీయుల ఆశయాలు, ఆలోచన విధానాలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. డ్రెస్ కోడ్‌తో గడప గడపకు వెళ్లి మహనీయుల చరిత్రను చాటి చెప్పాలని ఆయన ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.