బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించి హోరెత్తిస్తున్నది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించగా, అప్పటి నుంచే గులాబీ అభ్యర్థులు రంగంలోకి దిగారు. నిత్యం జనంతో మమేకమవుతూ, ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తమను ఆశీర్వదిస్తే రాబోయే ఐదేళ్లలో నియోజకవర్గాలను మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామంటూ మద్దతు కూడగడుతున్నారు. కానీ, ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇంకా అభ్యర్థుల వేటలోనే ఉన్నాయి. ఎంపికపైనే కుమ్ములాటలు జరుగుతున్నట్టు తెలుస్తుండగా, టికెట్ దక్కని పక్షంలో ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కరీంనగర్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార బీఆర్ఎస్ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటోంది. ఎన్నికలు జరిగిన ప్రతీసారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అభ్యర్థులను ముందే ప్రకటించి విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఇంకా అభ్యర్థులు ఎవరనేది ఖరారు కాకముందే బీఆర్ఎస్ అభ్యర్థులు కార్యకర్తలతో సమావేశాలు, ముఖ్యనాయకులతో మంతనాలు, ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎవరు ఎక్కడి నుంచి పోటీలో ఉంటారనేది ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఆ పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు అభ్యర్థుల ఎంపికకు ఆటంకాలుగా మారాయి. అంతే కాకుండా, కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేయాలనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. పోటీ ఎవరు చేయాలనే సమాలోచనల్లోనే కాంగ్రెస్, బీజేపీ కనిపిస్తున్నాయి. హుస్నాబాద్ సహా కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని 13 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో నిలిపింది. దీంతో కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
జోరుగా ప్రచారం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం కొత్తపల్లి మండలంలో జరిగిన యువజన సమ్మేళనంలో, కరీంనగర్ మండలంలో జరిగిన పార్టీలో చేరికల కార్యక్రమంలో పాల్గొంటూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొడిమ్యాలలో తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ మండలంలోని అనేక గ్రామాల్లో ఇప్పటికే ప్రచారం ముగించుకుని, మల్యాల మండలంలో ప్రచారం చేస్తున్నారు. ఇటు హుజూరాబాద్ నియోజకవర్గంలో అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కూడా హుజూరాబాద్ మండలం, పట్టణంలోని పలు వార్డుల్లో నాలుగు రోజుల నుంచే ప్రచారం ప్రారంభించారు. మానకొండూర్‌లో అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ షెడ్యూల్‌కు ముందు విస్తృతంగా పర్యటించారు.
జగిత్యాలలో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కుమార్‌తో పాటు ఎమ్మెల్సీ ఎల్ రమణ జగిత్యాలలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కోరుట్లలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో పాటు ఆయన తనయుడు, బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు ప్రచారం చేయడంతో పాటు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ సమాయత్తం చేస్తున్నారు. సిరిసిల్లలో పార్టీ శ్రేణులు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దిన మంత్రి కేటీఆర్‌ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి రుణం తీర్చుకుందామంటూ ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు.
ఈ నెల 17న జరిగే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కోరుతున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజాశీర్వాద యాత్ర పేరుతో ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు. మంథని నియోజకవర్గంలో పుట్ట మధు ఇప్పటికే ప్రజాశీర్వాద యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించి బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెంచారు. ఇలా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు నిత్యం ప్రజల్లో గడుపుతూ ఇటు ప్రజా హిత కార్యక్రమాలతోపాటు ప్రచార కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు.
ప్రజాక్షేత్రంలోనే అభ్యర్థులు
బీఆర్ఎస్ అభ్యర్థులు అనునిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే పార్టీ మరోసారి అవకాశం కల్పించడంతో షెడ్యూల్‌కు ముందు ప్రభుత్వ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతోపాటు సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపారు. షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించి, ఇంటింటికీ వెళ్తున్నారు. ప్రతి ఒక్కరినీ కలిసి మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తామని కోరుతున్నారు.
చేరికల జోరు
అధికార బీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులవుతున్న పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ పార్టీలో చేరుతున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజవకర్గంలో మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి పలువురు నాయకుల, కార్యకర్తలు ఇప్పటికే బీఆర్ఎస్లో చేరారు. కరీంనగర్ నగరంలో బీజేపీకి అండగా నిలిచిన సోషల్ మీడియా టీంలో కీలకంగా వ్యవహరించిన నాయకులు, కార్యకర్తలు సైతం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కరీంనగర్, కొత్తపల్లి మండలాలకు చెందిన అనేక మంది రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్శితులై పార్టీలో చేరుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఇటు మానకొండూర్‌లోనూ చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. హుజూరాబాద్‌లో గత ఎన్నికల్లో బీజేపీవైపు మొగ్గు చూపిన యువకులు ఇప్పుడు యువకుడైన అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంథనిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.