బీఆర్ఎస్ అధినేత, ప్రగతిప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కరీంనగర్ గడ్డకు రాబోతున్నారు. శుక్రవారం కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై, దిశానిర్దేశం చేయనున్నారు. గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతోపాటు ఎన్నికలపై ప్రజలను చైతన్యం చేయనున్నారు. గత పాలనలో పడ్డ బాధలు, స్వరాష్ట్రంలో సాధించిన విజయాలను కండ్లముందుంచనున్నారు. అలాగే ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. అక్కరకురాని పార్టీలకు ఓటు వేసినా జరిగే నష్టాన్ని వివరించనున్నారు. నగరం, పత్తికుంటపల్లి, జమ్మికుంటలో సభా వేదికలు సిద్ధం కాగా, ఆయాచోట్ల అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థులు సభలను విజయవంతం చేసే పనిలో తలమునకలయ్యారు.
– కరీంనగర్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని పార్టీల కంటే ముందే బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించడంతోపాటు మూడు చోట్ల సిట్టింగ్‌లకే మరోసారి అవకాశం కల్పించారు. హుజూరాబాద్‌లో మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డిని పోటీలో నిలిపారు. దీంతో అన్ని పార్టీల అభ్యర్థులకంటే ముం దుగానే బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించి నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్ తనదైన శైలిలో ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంగా ప్రచారంలో దూసుకుపోతున్నా రు. ఇటు చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కూడా గ్రామల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుండటంతో రెట్టించిన ఉత్సాహంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక హుజూరాబాద్‌లో అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి కూడా ప్రచా రంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఈ మూడు చోట్ల ఒకే రోజు ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించనున్నారు.
ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు చోట్ల ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. గత నెల 15న హుస్నాబాద్ వేదికగా సభలకు శ్రీకారం చుట్టిన ఆయన, ఆ తర్వాత 17న సిరిసిల్ల, ఈ నెల 2న ధర్మపురి, 3న కోరుట్ల, 7న మంథని, పెద్దపల్లిలో సభల్లో పాల్గొన్నారు. ఈ నెల 26 వరకు ఉమ్మడి జిల్లాలోని మరో ఏడు సభలకు హాజరవుతారు. అయితే ఇప్పటి వరకు ఏ రోజు ఉమ్మడి జిల్లాలో ఒకే రోజు సభల్లో పాల్గొనలేదు. కానీ, నేడు ఒకే రోజు మూడు నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననుండగా, ఆయాచోట్ల ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. సభా వేదికలను సిద్ధం చేయడంతోపాటు విజయవంతం చేయడం కోసం భారీగా జన సమీకరణ చేస్తున్నారు.
కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాలలో నేటి ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేసేందుకు కరీంనగర్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తన నామినేషన్ దాఖలు చేసిన రోజునే మంత్రి భారీ జన సమీకరణ చేశారు. నగరంలోని అన్ని డివిజన్లు, రెండు మండలాల నుంచి లక్షకుపైగా జనాన్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కరీంనగర్లో మధ్యాహ్నం 1.30 గంటలకు సభ జరగనుంది. ఆ తర్వాత చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని గంగాధర మండలం మధురానగర్ శివారులోని పత్తికుంటపల్లి కాలనీలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నారు.
దీనికోసం స్థానిక అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్ని ఏర్పాట్లూ చేశారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. ఇక్కడి సభలో మధ్యాహ్నం 2.35 గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొంటున్నారు. అనంతరం 3.45 గంటలకు హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట డిగ్రీ కళాశాలలో నిర్వహించే సభలో సీఎం పాల్గొంటున్నారు. ఇక్కడి అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు వస్తుండగా, బీఆర్ఎస్ కార్యకర్త ల్లో నూతనోత్తేజం కనిపిస్తున్నది. కరీంనగర్, చొ ప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో భారీ గా జన సమీకరణకు ప్రతి కార్యకర్తా తనవంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే గెలుపు బాటలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులకు పార్టీ అధినేత సభలు మరింత బలాన్ని చేకూర్చుతాయని భావిస్తున్నా రు. అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి జనా న్ని సమీకరించే పనిలో తలమునకలయ్యారు.