‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ 70 ఏండ్లలో ఈ ప్రాంతాన్ని అనేక పార్టీలు పాలించాయి. ఎందరో ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చి వెళ్లారు. కానీ అభివృద్ధి గురించి మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. నాడు ఎమ్మెల్యేగా అప్పటి సమైక్య సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని పేపు రూ.కోటి నిధులు మంజూరు చేయాలని ఎంత అడిగినా ఇవ్వలే. కానీ స్వరాష్ట్రంలో అడిగిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నిధుల వరద పారిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ఆయన కృషితోనే గడిచిన పదేండ్లలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించింది. నేనొక్కటే విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్, బీజేపీని నమ్మితే రాష్ట్రం అంధకారం అవుతుంది. వాళ్లను నమ్మొద్దు. మోసపోవద్దు’ అని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ఆదివారం కరీంనగర్‌లోని గోపీకృష్ణ ఫంక్షన్ హాల్లో బీజేపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరగా, కండువాలు కప్పి ఆహ్వానించి, మంత్రి మాట్లాడారు. ‘ఐదు నెలలు నా కోసం పని చేయండి.. ఐదేండ్లు మీ కోసం పనిచేస్తా. మంచి భవిష్యత్ అందిస్తా’నని వారికి భరోసా కల్పించారు.
– కరీంనగర్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ)
కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం
మేం ఇతర పార్టీల నాయకుల్లా కాదు. మా ఫోన్లు స్విచ్ఛాఫ్ ఉండవు. కార్యకర్తలు మమ్మల్ని ఎప్పుడైనా కలువచ్చు. మాతో మాట్లాడవచ్చు. బీఆర్ఎస్లో చేరిన ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం. కొందరు నాయకులు ఓట్ల సమయంలో చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతారు. మేం అలాంటి వాళ్లం కాదు. ప్రజల సంక్షేమం, నగర అభివృద్ధిని కాంక్షిస్తున్న నాయకులెవరో.. తప్పుడు మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే నాయకులెవరో ప్రజలు గమనిస్తున్నారు. కరీంనగర్ అభివృద్ధికి మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మూల స్తంభాల్లాంటి వారు. 26 ఏండ్లుగా ఓటమి ఎరుగుని నాయకుడు గంగుల. ఆయన నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. మరోసారి ఆయనను గెలిపించుకునే బాధ్యత మనందరిపైనా ఉన్నది.
– యాదగిరి సునీల్ రావు, మేయర్
అభివృద్ధి అంటేనే గంగుల కమలాకర్. ఆయన గెలుపు కోసం సమష్టిగా కృషి చేద్దాం. గతంలో కరీంనగర్ ఎలా ఉండేదో..? ఇప్పుడు ఎలా ఉన్నదో ఒక్కసారి చూడాలి. ఆయన చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్శితుడినై పార్టీలో చేరా.
బీజేపీ నుంచి బీఆర్ఎస్లో కొత్తగా చేరిననాయకుడు మంతెన కిరణ్
రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లి అడిగినా కరీంనగర్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెబుతున్నారు. ఆ ఘనత మంత్రి గంగుల కమలాకర్కే దక్కుతుంది. ఆయన నాయకత్వంలో పనిచేసి అభివృద్ధిలో భాగస్వామిని కావాలనే లక్ష్యంతోనే బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరా.
బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన నాయకుడు చిగుర్ల రాజు
కరీంనగర్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): 70 ఏండ్ల పాలనలో ఈ ప్రాంతాన్ని ఎన్నో పార్టీలు, ఎందరో మహామహులు పాలించినా చేసింది శూన్యమని, కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే మళ్లీ అంధకారమేనని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్‌లోని గోపీకృష్ణ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. బీజేపీ నుంచి పలువురు నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా, వారికి మేయర్ వై సునీల్‌రావుతో కలిసి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, బీఆర్ఎస్లోకి ఎందుకు రావాలని ప్రశ్నించకుంటే అనేక కారణాలు కనిపిస్తాయని. తెలంగాణ సాధించిన పార్టీగా, తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తున్న పార్టీగా బీఆర్ఎస్ ఉంటుందని స్పష్టం చేశారు. కరీంనగర్‌ను అన్ని రంగాల్లో ముందుంచాలనే ఉద్దేశంతో ఐటీ టవర్ నిర్మించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మానేరు రివర్ ఫ్రంట్‌ను మంజూరు చేశారని, రూ.850 కోట్లతో దీనిని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
మానేరు రివర్ ఫ్రంట్ పూర్తయితే దేశంలోనే కరీంనగర్‌కు ప్రత్యేక గుర్తింపు వస్తుందని, ప్రపంచంలోనే మూడో స్థాయిలో ఇక్కడ వాటర్ పౌంటెయిన్ను చేపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కరీంనగర్ గొప్పగా అభివృద్ధి చెందిందని, ఇంకా చెందాల్సిన అవసరం ఉందని వివరించారు. ఇప్పటికే నగర ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, ఒకప్పుడు రాష్ట్రంలో రెండో గొప్ప నగరంగా వరంగల్ ఉండేదని, ఇప్పుడు ఆ స్థానంలో కరీంనగర్ చేరిందని మంత్రి స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు ఉండేవి కాదని, హైదరాబాద్ వంటి నగరాల్లో నిత్యం అల్లర్లు చెలరేగి కర్ఫ్యూలు విధించే పరిస్థితి ఉండేదన్నారు. కానీ కేసీఆర్ పాలనలో అలాంటి పరిస్థితి రాలేదని అన్నారు. ఎక్కడ శాంతి భద్రతలు ఉంటాయో..? అక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌కు రావడమే అందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్, బీజేపీని నమ్మొద్దన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, ఇపుడు పార్టీలో చేరే వారికి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పారు. నిత్యం ప్రజల మధ్యనే ఉండి ప్రజల మంచి చెడ్డలు చూస్తానని స్పష్టం చేశారు.
70 ఏండ్లు పాలించినా చేసింది ఏమీ లేదు
70 ఏండ్లలో అనేక పార్టీలు పాలించాయి. ఎందరో ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చి వెళ్లారు. కానీ, కరీంనగర్ అభివృద్ధి గురించి మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. 2009లో నేను ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఒక కోటి రూపాయలు ఇవ్వాలని అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిని ఎంత బతిమిలాడినా ఇవ్వలేదు. కానీ, తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్‌ను అడిగిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రాష్ట్రంలోనే మొట్ట మొదటి జీవో తెచ్చి కరీంనగర్‌కు రూ.125 కోట్లు ఇచ్చారు. ఈ నిధులు ఖర్చు చేసిన తర్వాత వెళ్లి మళ్లీ అడిగినా ఎలాంటి ఆలోచన చేయకుండా రూ.350 కోట్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే.
– మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్లో బీజేపీకి ఆ పార్టీ కార్యకర్తలు, హిందూవాహిని కార్యకర్తలు షాకిచ్చారు. ఆదివారం మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో పెద్ద ఎత్తున చేరారు. 23 ఏండ్లుగా బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న హిందూవాహిని పుల్ టైమర్ మంథెన కిరణ్, ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం ఆయన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, పెద్దపల్లి జిల్లా ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. అలాగే బీజేపీ నగర వెస్ట్ జోన్ యువమోర్చా కార్యదర్శిగా పనిచేస్తున్న గోస్కుల మహేశ్, సోషల్ మీడియా కన్వీనర్‌గా పనిచేస్తున్న పరాంకుశం త్రినాథ్, బీజేపీ నగర వెస్ట్ జోన్ యూత్ కార్యదర్శిగా పనిచేస్తున్న శీలం అజయ్‌తోపాటు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న చిగుర్ల రాజు, పెట్టెం సుధాకర్, ప్రకాశ్ ఆచార్య, బూర్ల హేమంత్, రత్నం ప్రసన్న కృష్ణ, దేవునూరి రాజు, కొలిపాక శ్యాం తదితరులతోపాటు సుమారు 500 మంది మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.